నీచ రాజకీయాలు చేస్తే అడుగు పెట్టనివ్వం..

పిన్నెల్లిపై -ఎమ్మెల్యే జూలకంటి ఫైర్
మాచర్ల, ఆంధ్రప్రభ : హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు, దాడులకు తెగబడి సుద్దపూసలా శ్రీరంగ నీతులు వల్లెవేయడం ఆపు పిన్నెల్లి అని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిపి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత వైసిపి ప్రభుత్వంలో వేల మంది టీడీపీ కార్యకర్తల కుటుంబాలపై అక్రమ కేసులు బనాయించి, భౌతిక దాడులకు తెగబడి హత్య రాజకీయాలకు తెర తీసిన సంగతి మరిచావా పిన్నెల్లి అని ప్రశ్నించారు. 15 నెలల కూటమి ప్రభుత్వంలో మాచర్ల నియోజకవర్గం ఒక ప్రశాంత వాతావరణంలో ప్రజా జీవనం కొనసాగుతోందని తెలంగాణలో తల దాచుకొని పిన్నెల్లి సోదరులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని జూలకంటి ఆరోపించారు.
దమ్ము, ధైర్యం ఉంటే మాచర్ల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. దశాబ్దాల కల వరికపూడిసెల ప్రాజెక్టు నిర్మాణంపై బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను నిలువున మోసం చేశారని పేర్కొన్నారు. వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణం తన జీవితాశయం అని, ప్రాజెక్టు నిర్మించకుంటే రాజకీయాలు మానుకుంటానని తేల్చి చెప్పారు.
మాచర్లకు పట్టిన శని మీరు
మాచర్ల నియోజకవర్గానికి పట్టిన శని ఉంగరాల సోదరులుగా పేరొందిన పిన్నెల్లి సోదరులు మీరు అని ఎమ్మెల్యే జూలకంటి ఎద్దేవ చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధిని మరిచి, మీ సొంత అభివృద్ధిని ఏ విధంగా పెంచుకున్నారో ప్రజలకు బాగా తెలుసు అని ఆయన వివరించారు.
అధికారులు, సీసీ కెమెరాలు సాక్షిగా ఈవీఎం ను ధ్వంసం చేస్తే పోలీసులు కేసులు పెడితే అవి అక్రమ కేసులు ఎందుకవుతాయని ప్రశ్నించారు. సంయమనం పాటిస్తూ.. గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధి పనులతో ముందుకు వెళుతుంటే అవి చూసి ఓర్వలేక నియోజకవర్గంలో అలజడులు సృష్టించాలని రామకృష్ణారెడ్డి చూస్తున్నారని చెప్పుకొచ్చారు.
నీచ రాజకీయాలు చేస్తే అడుగుపెట్టనివ్వం..
ప్రజలను తప్పుదోవ పట్టించేలా నీచ రాజకీయాలకు పాల్పడితే పిన్నెల్లి సోదరులను నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వమని ఎమ్మెల్యే జూలకంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. గడచిన 15 నెలల్లో వేల కోట్లతో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, 15 సంవత్సరాల మీ హయాంలో నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు.
కూటమి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా మీరు సాగించిన రాక్షస క్రీడకు లెంపలేసుకొని, ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పి రాజకీయ సన్యాసం తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు ధారు నాయక్, మున్సిపల్ చైర్మన్ మాదార్, తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కుర్రి శివారెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామాంజీరెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
