బెల్లంపల్లిని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతాం..

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి రమేష్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి సమక్షంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గా దావ స్వాతి రమేష్, వైస్ చైర్మన్ రంగంశెట్టి సత్యనారాయణ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే.. నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపి వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. మున్సిపల్ కమిషనర్ సంపత్ కూడా చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌లను సన్మానించి అభినందనలు తెలిపారు. చైర్‌పర్సన్ దావ స్వాతి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సహకారంతో పట్టణ సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు.

ప్రతి ఒక్కరి సహకారంతో పారదర్శకమైన పాలన అందిస్తామని, కౌన్సిలర్లందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామికి, కౌన్సిల్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని ప్రతి గల్లీలో ఉన్న సమస్యలను స్వయంగా పర్యవేక్షిస్తానని, ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, వీధి దీపాల ఏర్పాటు వంటి పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణ మాట్లాడారు.

చైర్‌పర్సన్‌తో పాటు కౌన్సిలర్లందరినీ సమన్వయం చేసుకుంటూ, రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవలో నిమగ్నమవుతానని పేర్కొన్నారు.బెల్లంపల్లి పట్టణ సమగ్ర అభివృద్ధికి, వార్డుల్లో నెలకొన్న మౌలిక సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఆశయాలకు అనుగుణంగా బెల్లంపల్లిని అవినీతి రహిత, ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు శ్రమిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply