KNL | అర్హులకు ఇళ్ల ప‌ట్టాలు పంపిణీ చేస్తాం : మంత్రి టీజీ భ‌ర‌త్

కర్నూలు బ్యూరో, జూలై 1, ఆంధ్రప్రభ : క‌ర్నూలు న‌గ‌రంలో అర్హుల‌కు ఇళ్ల ప‌ట్టాలు పంపిణీ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ (T.G. Bharat) అన్నారు. మంగళవారం ఉదయం స్టేట్ గెస్ట్ హౌస్ లో మంత్రి టి.జి భరత్.. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, కర్నూలు తహసీల్దార్ వెంకట రమేష్, అర్బన్ తహసీల్దార్ రవి, కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులుతో స‌మీక్ష స‌మావేశం (Review meeting) నిర్వ‌హించారు.

ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… మంగ‌ళ‌గిరిలో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ప్ర‌జ‌ల‌కు ఇళ్ల ప‌ట్టాలు పంపిణీ చేసిన విధంగా క‌ర్నూల్లో కూడా పంపిణీ చేసేందుకు త‌గిన విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు చెప్పారు. న‌గ‌రంలోని పంప్ హౌస్ స‌మీపంలో ఉన్న గూడెం కొట్టాల ప్ర‌జ‌ల‌కు ఇళ్ల ప‌ట్టాలు ఇస్తామ‌ని యువ‌గ‌ళం పాద‌యాత్ర సంద‌ర్భంగా మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చిన‌ట్లు గుర్తు చేశారు. ప్ర‌జ‌ల‌కిచ్చిన హామీ మేర‌కు వారికి ప‌ట్టాలు ఇచ్చేలా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

దీంతో పాటు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి వారి పేరు మీద పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. గ‌తంలో ఇళ్ల ప‌ట్టాలిచ్చిన వారికి స్థ‌లాలు లేవ‌ని చాలా మంది త‌న దృష్టికి తీసుకువ‌చ్చార‌ని, ఈ వివ‌రాలు తీసుకొని ప‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికీ స్థ‌లాలు లేని వారికి స్థ‌లాలు చూపించాల‌ని చెప్పారు. అలాగే బుధ‌వార‌పేట ప్రాంతంలో నివాసితుల వివ‌రాలు తీసుకొని ప‌ట్టాలు ఇవ్వాల‌ని అధికారుల‌కు చెప్పారు. 2014కు ముందు ఈ.తాండ్ర‌పాడులో ప‌ట్టాలిచ్చిన ప్రాంతంలో స్థ‌లాలు గుర్తించ‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని..ఈ స‌మ‌స్యను ప‌రిష్క‌రించాల‌ని మంత్రి టి.జి.భ‌ర‌త్ అన్నారు.

వెంకటరమణ కాలనీ (Venkataramana Colony) మున్సిపల్ వాటర్ వర్క్స్ ఎదురుగా ఉన్న నాలుగున్నర ఎకరాల డాటెడ్ ల్యాండ్ పోలీసు వారి దగ్గర నుండి కర్నూలు ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనుల నిమిత్తం తీసుకోవటానికి కావలసిన చర్యలను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ఏ, బీ, సీ క్యాంప్ ల ప్రభుత్వ గృహ సముదాయాల్లో శిథిలావస్థకు చేరిన గృహాలను పూర్తిగా తొలగించి చదును చేయాలని, ఆ స్థలాలను ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకోవడానికి అనుకూలంగా మార్చాలని ఆదేశించారు.

Leave a Reply