- ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపించండి: దండు రాధ దత్తురాం
మక్తల్, ఆంధ్రప్రభ : కర్ని గ్రామ అభివృద్ధికి గ్రామస్తులు సర్పంచ్‌గా గెలిపిస్తే… గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని నారాయణపేట జిల్లా, మక్తల్ మండలంలోని కర్ని గ్రామ సర్పంచ్ అభ్యర్థి దండు రాధ దత్తురాం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి శనివారం కర్ని గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా దండు రాధ దత్తురాం మాట్లాడుతూ, గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించేందుకు నిశ్చలమైన కృషి చేస్తానని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా గ్రామ అభివృద్ధి నిలిచిపోతున్నందున, సర్పంచ్‌గా గెలిస్తే గ్రామాన్ని సర్వత్రా అభివృద్ధి దిశలో నడిపిస్తానని చెప్పారు.
అత్యంత నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులవారికి అందడం, గ్రామంలోని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం వంటి బాధ్యతలను స్వయంగా చూసుకుంటానని తెలిపారు. గ్రామంలోని ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొని, నిస్వార్ధంగా సేవ చేసే భాగ్యం కల్పించాలని ఓటర్లను కోరారు.
సర్పంచ్‌గా గెలిస్తే కర్ని గ్రామం రూపురేఖలు మారిపోతాయని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి మద్దతుతో అన్ని విధాలుగా అభివృద్ధి చూపిస్తానని తెలిపారు.
కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి సభ్యులు చిన్న రంగప్ప, మాజీ సర్పంచ్ రాఘవేంద్ర గౌడ్, బిజెపి, కాంగ్రెస్ నాయకులు భాస్కర్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, వాకిటి కిష్టప్ప, భగవంతు రెడ్డి, మైబు, భీమేష్ తదితరులు పాల్గొన్నారు.

