హైదరాబాద్ : దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర రెడ్డి కలల సాకారం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రాణహిత–చేవెళ్ల, ఎస్‌ఎల్‌బీసీతో పాటు వైఎస్సార్ రూపకల్పన చేసిన సాగు ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు.

డా. వైఎస్ రాజశేఖర రెడ్డి మెమోరియల్ అవార్డు 2025 కార్యక్రమంలో సీఎం రేవంత్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పద్మశ్రీ సుభాష్ పాలేకర్, శ్రీ పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. చదలవాడ సుధా, డా. చదలవాడ నాగేశ్వరరావుకు తొలి డా.వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారక అవార్డులను సీఎం అందజేశారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “వ్యవసాయం దండగ‌ కాదు పండుగ చేయాలన్న వైఎస్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నాం. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని గోదావరి, కృష్ణా నదులపై తలపెట్టిన ప్రాజెక్టులను కచ్చితంగా పూర్తి చేసి తీరుతాం.

రైతాంగానికి మేలు చేయాలని, చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, కొంత కొడంగల్ ప్రాంతం చివరి ఆయకట్టు వరకు నీరు అందించాడానికి వైఎస్సార్ ఆశయానికి అనుగుణంగా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత – చేవెళ్ల కడతాం. ఫ్లోరైడ్ మహమ్మారి నుంచి నల్గొండ ప్రజలను రక్షించాలని సంకల్పించిన ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తాం.

కేంద్ర ప్రభుత్వం సరిగా సహకరించని కారణంగా రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వచ్చాయి. పాలేకర్ సూచించినట్టు మార్గంలో రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అవసరమైన ప్రణాళికలు రచిస్తాం.

అలాగే, విద్యార్థి దశ నుంచి వైఎస్సార్‌కు వెన్నంటి నిలిచిన కేవీపీ రామచంద్రరావు త్యాగం, కృషి గురించి సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. వైఎస్ మరణించి 16 సంవత్సరాలు పూర్తయినా, వారిపై ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం.. అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Leave a Reply