స్వచ్ఛతలో టాప్‌లో నిలపాలి

స్వచ్ఛతలో టాప్‌లో నిలపాలి
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర
శ్రీకాకుళం,అక్టోబర్ 18(ఆంధ్రప్రభ బ్యూరో): స్వచ్ఛతలో శ్రీకాకుళం జిల్లాను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధి అసరవల్లి నుంచి ఖాజీపేట రహదారి లో స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలసి పరిసరాలను శుభ్రం చేశారు. రోడ్డును ఆనుకుని మొక్కను నాటారు.

ఈ సందర్భంగా మీడియాతో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ,. రాష్ట్రం మొత్తం మూడవ శనివారం స్వచ్ఛంద్ర కార్యక్రమం పంచాయతీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ జరుగుతూ లక్ష్యాల సాధన దిశగా సాగుతోందని స్పష్టం చేశారు. స్వచ్ఛత మన నిజ జీవితంలో భాగం కావాలని.. మన ప్రతీ ఆలోచనలో కూడా స్వచ్ఛత ఉండాలని రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. పట్టణీకరణ పెరిగిన నేపథ్యంలో వాయు కాలుష్యం కూడా పెరుగుతూ ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఢిల్లీ ఈ తరహా వాయు కాలుష్య ఇబ్బందితో బాధపడుతూ ఉందని తెలిపారు. ఇప్పటికే ఈ సమస్యపై మేల్కొని కాలినడక, సైకిల్ వాడకంపై దృష్టి సారించాలని కోరారు. డస్ట్ పొల్యూషన్ కూడా వాయు కాలుష్యానికి మరో కారణం అని.. నిర్మాణాలు చేపట్టే సమయంలో చుట్టూ పరదాలతో కప్పి ధూళిని నియంత్రించాలని కోరారు.
తల్లి పేరు పై ఓ చెట్టు నాటాలి అనే బృహత్తర కార్యక్రమానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారని.. మన కుటుంబాలలో జరిగే శుభకార్యాలలో సైతం పర్యావరణ హితమైన కార్యక్రమాలు చెయ్యడం అలవాటు చేసుకోవాలని కోరారు. గత సీజన్లో శ్రీకాకుళం లో ఇరవై ఐదు లక్షలలో పైగా మొక్కలను నాటడం జరిగిందని.. ఇవి సమీప భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయని స్పష్టం చేశారు. శ్రీకాకుళం నగరంలో సైక్లింగ్ ట్రాక్ లు అందుబాటులోకి తీసుకువచ్చి ఇటు పర్యావరణానికి, అటు ఆరోగ్యానికి మేలు కలిగేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు. సండే ను అందరూ సైకిల్ డే గా మార్చుకోవాలని సూచించారు. గూగుల్ విశాఖకు రావడం చరిత్రాత్మకం అన్న రామ్మోహన్ నాయుడు.. ఈ విషయంలో కొందరు విమర్శలు చేస్తుండటం బాధాకరం అని అన్నారు. పలాస విమానాశ్రయ ఏర్పాటు కోసం అందరితో కలసి ముందుకు వెళ్తున్నామని.. అందరికీ న్యాయం చేసే అడుగు ముందు వేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివిడి ప్రసాదరావు, అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఈఓ, పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరి వర ప్రసాద్ పాల్గొన్నారు.
