ఎల్లారెడ్డి, జులై 7 (ఆంధ్రప్రభ): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి (Ella Reddy) పట్టణ కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాల (Tribal Girls’ Gurukul School) కు చెందిన విద్యార్థులు సోమవారం ఎల్లారెడ్డి-బాన్సువాడ (Banswada) ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ… గిరిజన పాఠశాలలో చదువుతున్న తాము అన్నం తినేటప్పుడు తరచుగా పురుగులు వస్తున్నాయని, ఈ విషయంపై పలుమార్లు ప్రిన్సిపల్, అధ్యాపకుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
తప్పని పరిస్థితిలో మేమందరం వచ్చి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించి నాణ్యమైన భోజనం అందించాలని వారు డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థినీలు రోడ్డుపై బఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో ఎల్లారెడ్డి-బాన్సువాడ ప్రధాన రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి తహసీల్దార్ ప్రేమ్ కుమార్ రోడ్డుపై బైఠాయించిన విద్యార్థినులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు.