బాగా చదవండి
- విద్యార్థులకు మోటివేషన్ .. సహపంక్తి భోజనం
- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆకస్మిక హాస్టల్ తనిఖీ
( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేలా వసతి గృహ విద్యార్థులను చేయిపట్టి నడిపించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ (Collector Lakshmisha) వసతి గృహ సంక్షేమ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టర్ లక్ష్మీశ విజయవాడలోని గుణదలలోని ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులతో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్థులతో ముచ్చటించి ఏర్పాట్లతో పాటు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతుందో లేదో అడిగి తెలుసుకున్నారు. మొత్తం 165 మంది ఉన్న హాస్టల్‌లో తాగునీటి సరఫరా పాయింట్ వద్ద నీటిని పరీక్షించి చూశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ (Collector Lakshmisha) మాట్లాడుతూ… వసతి గృహాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటోందని.. ఇందుకు సంబంధించి ఒక్కో వసతి గృహానికీ ఒక జిల్లా అధికారికి ప్రత్యేక అధికారిగా బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఈ ప్రత్యేక అధికారులు వారానికి రెండుసార్లు వసతిగృహాలను సందర్శించి భోజనం, పారిశుద్ధ్యం, తాగునీరు ఇలా ప్రతిఒక్క అంశాన్నీ పరిశీలించి ఆన్‌లైన్లో నివేదికలు సమర్పిస్తారని తెలిపారు. పిల్లల ఆరోగ్యభద్రతకు భరోసా కల్పిస్తూ సేవలందించేందుకు వైద్య బృందాలు కూడా పనిచేస్తున్నట్లు తెలిపారు.
వసతి గృహాల్లో చదువుకొని స్థిరపడిన వారితో మోటివేషన్ తరగతులు నిర్వహించాలని, కెరీర్ గైడెన్స్‌పైనా విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అండగా మేమున్నామని చిన్నారులు కూడా బాగా చదువుకొని తల్లిదండ్రులు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కలెక్టర్ వెంట వసతిగృహ ప్రత్యేక అధికారి, డీపీవో పి.లావణ్యకుమారి, వసతిగృహ సంక్షేమ అధికారి ఎ.రజనీ కుమారి, సిబ్బంది ఉన్నారు.