మధిర, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో ఆదాయం లేకపోయినా.. అప్పులకు మాత్రం క్రమం తప్పకుండా వడ్డీలు చెల్లిస్తూనే ఉన్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం మధిర నియోజకవర్గం ఎర్రుపాలెంలో మీడియాతో ఆయన మాట్లాడారు. గత పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇండ్లు ఇస్తామని మభ్య పెట్టిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ చేతిలో పేడితే.. రూ.7లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లిపోయిందని ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా.. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. 90లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందజేస్తున్నామన్నారు.
నిరుద్యోగులకు ఉపాధి..
నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రూ.9వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించామని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. జూన్ 2న లబ్ధిదారులకు ఆర్థిక సాయానికి సంబంధించి ధ్రువీకరణ పత్రాలను అందజేస్తామన్నారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో సిబిల్ స్కోర్ పేరుతో అసత్య ప్రచారం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. ఫేక్ ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని యువతకు విజ్ఞప్తి చేశారు.
నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు..
రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు ఇదిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం రూ.22,500 కోట్లు ఖర్చు చేస్తుందని భట్టి తెలిపారు. ఇళ్లు లేని వాళ్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఇక వ్యవసాయం, ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ఏటా రూ.12,500 కోట్లు ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. ఈనెల 18న నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సీఎం రేవంత్ రెడ్డి పథకాన్ని ప్రారంభించబోతున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.