పెద్దపల్లి, ఆంధ్రప్రభ : గోదావరి (Godavari) జలాల విషయంలో తమ ప్రభుత్వ వైఖరిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) అనేక సందర్భాల్లో స్పష్టం చేసినా ఏదోరకంగా బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) అన్నారు. బుధవారం పెద్దపల్లి (Peddapally) లో నిర్వహించిన ఇందిరాశక్తి సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటూ ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ఆలోచన చేసిన కేసీఆర్ (KCR) ఈ రోజు తమకేమి తెలియనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
నీటి వాటాల విషయంలో రాజీ లేదు…
గోదావరిలో తెలంగాణ హక్కుగా రావాల్సిన ఒక్క నీటి బొట్టును కూడా వదులుకోబోమని, మన వాటా విషయంలో కేంద్ర ప్రభుత్వంతో అన్ని ప్రయత్నాలు చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. నీటి వాటాల విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టును ఎట్టిపరిస్థితిలో అంగీకరించబోయేది లేదన్నారు. తెలంగాణకు దక్కాల్సిన వాటా దక్కిన తర్వాతే మిగతా ప్రాంతానికి అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అన్నారు. కాళేశ్వరం సమీపంలోని రైతులకు నీరు ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని దుయ్యబట్టారు. కూలిపోయిన డ్యామ్ ల గురించి బీఆర్ఎస్ నేతలు ఇవాళ గొప్పగా మాట్లాడుతున్నారని బనకచర్ల విషయంలో ఆనాడు లేని ఆరాటం ఇవాళ వచ్చిందా అని ప్రశ్నించారు.
ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి..
మహిళలకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టామని, విద్యార్థులకు యూనిఫాంలు కుట్టే పనులు మహిళా సంఘాలకే అప్పగించామని మంత్ర శ్రీధర్‌బాబు తెలిపారు. మహిళ సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. సోలార్ ప్యానల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి మహిళలకే అప్పగించామన్నారు. పెద్దపల్లి జిల్లాలో మహిళా సంఘాల నుంచి 9 బస్సులను ఆర్టీసీలో అద్దెకు తీసుకున్నామని ఇదే గతంలో అయితే కొందరు పెద్దమనుషుల నుంచే ఆర్టీసీలో బస్సులు అద్దెకు తీసుకునేవారని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఆలోచనలో భాగంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదన్నారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమనే లక్ష్యంతో పని చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.