water sharing | అసెంబ్లీ వేదికగా చర్చ.. అంతిమంగా తీర్మానం?

water sharing | అసెంబ్లీ వేదికగా చర్చ.. అంతిమంగా తీర్మానం?

రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కార్యాచరణ..
జల జగడం పై అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు
ఏపీ, తెలంగాణ మధ్య గతంలో జరిగిన ఒప్పందాలపై..
కూలంకషంగా దృష్టి సారించిన సీఎం రేవంత్..

water sharing | హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: నీటి వాటాల విషయంలో రాజీలేని పోరుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండేందుకు చట్టసభల వేదికగా కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతాలు పంపించనుంది. అందుకు రాజకీయాలకు అతీతంగా అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానం చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. వివాదరహితంగా వాటాలు తేల్చాల్సింది కేంద్రమేనని అంతిమంగా ఆ తీర్మానంలో పేర్కొననున్నది.

తెలంగాణాకు ప్రధాన జలవనరులైన కృష్ణా, గోదావరి నదీ జలాల వాటాల పై త్వరలో జరగనున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రాజకీయంగా వేడిని పెంచనున్నాయి. గత ప్రభుత్వంలో పదేళ్లపాటు జరిగిన అన్యాయం పై అధికార పక్షం.. గడిచిన రెండేళ్లలో నిర్లక్ష్యం, ఉదాసీనత పై ప్రతిపక్షం.. చర్చకు పోటీపోటీగా కత్తులు నూరుతున్నాయి. లక్షలాది మంది రైతుల భావోధ్వేగంతో కూడుకుని ఉన్న ‘జలపోరు’… అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వేడిని పెంచే అవకాశం ఉంది.

water sharing
water sharing

కొట్లాడి విడిపోయినా.. అభివృద్ధి, పునర్ నిర్మాణంలో కలిసి ముందుకు సాగుదామన్న సానుకూల వైఖరితో ఇన్నాళ్లూ వేచి చూసిన రేవంత్ సర్కారు నీటి వాటాల విషయంలో ఇక తాడో.. పేడో..
తేల్చేసుకుందామన్న నిర్ణయానికి వచ్చేసింది. చట్టపరంగా, న్యాయ బద్ధంగా తెలంగాణాకు రావాల్సిన నీటి వాటాలను సాధించుకోవడంతో పాటు గతంలో జరిగిన అన్యాయం పై కూడా ప్రతిఘటించే దిశగా సంసిద్ధమవుతోంది.

అలాగే పొరుగు రాష్ట్రం అక్రమంగా వినియోగిస్తున్న నికర జలాలపై రాజీలేని పోరాటం చేయాలని, అందుకు ఖచ్చితమైన లెక్కలు తేలుస్తూ.. నివేదికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

water sharing | అంతర్గత కసరత్తు ముమ్మరం

ఇటీవల ఢిల్లీలో భేటీ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు ముందు సమన్వయ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అది కుదరకుంటే రాష్ట్ర ప్రయోజనాలు, హక్కుల కోసం ప్రతిఘటన తప్పదన్న సంకేతా లిస్తూ ఇప్పటికే ప్రకటన చేశారు. పోలవరం డెడ్ స్టోరేజీకి చేరుకున్నా.. ఆ ప్రాజెక్టు నుంచి నీటిని తోడేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం తాజా పరిణామా లతో వ్యూహాత్మకంగా, పకడ్బందీగా ముందడుగు వేయాలని నిర్ణయిం చింది.

ఈ క్రమంలో కృష్ణా, గోదావరి జలాల్లో ఏపీ, తెలంగాణా నీటి వాటాలపై నిగ్గు తేల్చేసే దిశగా సర్కారు అంతర్గత కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్రాల మధ్య సమన్వయ లోపం పై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో ఆరా తీశారు. గత ప్రభుత్వంలో జరిగిన ఒప్పందాలు, వాటి పరిణామాలు, రాష్ట్రానికి జరిగిన అన్యాయం, ఉద్దేశపూర్వకంగా అనుసరించిన విధానం పై చర్చించారు. ఆ ఒప్పందాల డాక్యుమెంట్లు తెప్పించుకుని పరిశీలించారు. ఏపీ అక్రమ వినియోగం పై త్వరలో ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడితో భేటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంసిద్ధమవుతున్నారు.

ఇప్పుడున్న నీటి కేటాయింపులు, నీటి వినియోగం గురించి ప్రధానంగా చర్చించనున్నారు. తెలంగాణకు హక్కు ఉన్న నికర జలాల పై సమ్మక సారక్క ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టులు కడుతున్నామని.. కానీ మా శాశ్వత కేటాయింపుల్లోని ప్రాజెక్టుల పై ఏపీ ఎందుకు అభ్యంతరం చెబుతోందని సీఎం రేవంత్ సూటిగా ప్రశ్నిస్తున్నారు.

water sharing
water sharing

బనకచర్లకు అనుమతి ఇచ్చే ముందు నికరజలాల సంగతి తేల్చాల్సిందేనని ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు అల్టిమేటం కూడా ఇచ్చారు. కేంద్రం వ్యవహరించిందిలా… శ్రీశైలం, నాగార్జున సాగర్ సహా ఇతర ప్రాజెక్టులలో టెలీమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెట్టారని ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఆరోపిస్తున్నారు. అవసరమైతే ఖర్చు కూడా మేమే భరిస్తామని చెప్పినా ఫలితం లేకుండా పోయింది. అందుకోసం ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి తెలంగాణకు 50 ఏళ్ల పాటు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణం ఇవ్వాలన్న ప్రతిపాదనను కూడా కేంద్రం సున్నితంగా తోసి పుచ్చింది. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ నాన్చే దోరణి అవలంభిస్తున్న కారణంగా ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని తెలంగాణ భావిస్తోంది.

water sharing | ఇంజనీరింగ్ నిపుణుల వాదన ఇదీ…

ఇంజనీరింగ్ నిపుణుల వాదన ప్రకారం.. నిజానికి కృష్ణా బేసిన్లో ఇరు రాష్ట్రాల్లో సాగుకు సరిపోయేన్ని నీళ్ళు ఉన్నాయి. కానీ బేసిన్లోని ప్రాంతాల అవసరాల కంటే బేసిన్ ఆవల ఉన్న ప్రాంతాల అవసరాలకు పెద్దపీట వేసి చూసినప్పుడు లోటు బేసిన్గానే కనబడుతోంది. నాడు బచావత్ ట్రిబ్యునల్ ముందు కర్ణాటక, మహారాష్ట్రలు ఆంధ్రప్రదేశ్ బేసిన్ ఆవలకు తరలించే నీటి వల్లనే కృష్ణా బేసిన్లో లోటు ఏర్పడిందని వాదించాయి. వరి పండించడానికి కూడా 130 టీఎంసీలు కృష్ణా డెల్టా ఆయకట్టుకు సరిపోతాయి.

కానీ ఏటా 200-300 టీఎంసీలకు పైగా డెల్టా ఆయకట్టుకు మళ్లించారు. అట్లాగే కేసీ కెనాల్, సాగర్ కుడి కాలువ వినియోగాలు కూడా అత్యధిక శాతం బేసిన్ ఆవలనే ఉన్నాయి. బేసిన్కు అటువైపు నున్న ప్రాంతాలకు మళ్లించే నీటి వల్లనే లోటు ఏర్పడిందన్న విషయాన్ని మరుగుపరిచి.. కృష్ణా బేసిన్లో నీళ్లు లేవు, అది లోటు బేసిన్ అని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఏటా సగటున 15 టీఎంసీల వాటా గాయబ్ కృష్ణా బేసిన్ లోని హైదరాబాద్ నగరానికి వినియోగించే తాగునీటిని బచావత్ ట్రిబ్యూనల్ ప్రకారం 20శాతం మాత్రమే లెక్కించాల్సి ఉంటే, ఆంధ్రప్రదేశ్ అడ్డుకుంటున్నందువల్ల గత పదేళ్ళుగా ఏటా సగటున 15 టీఎంసీలు తెలంగాణ కోల్పోయింది. పోలవరం ద్వారా మళ్లించే గోదావరి నీటిలో 45 టీఎంసీలు కృష్ణా బేసిన్లో నాగార్జునసాగర్ ఎగువన ఉన్న తెలంగాణకు దక్కాలి. రాష్ట్రం ఆ నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించుకుంది.

మైనర్ ఇరిగేషన్కి కేటాయించిన 90 టీఎంసీలలో 45 టీఎంసీల మిగులును కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించింది. ఈ కేటాయింపులను ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాజోలిబండ ఆనకట్ట ఆధునికీకరణ పనులు పూర్తికానీయకుండా అన్యాయంగా అడ్డుతగులుతోంద ని తెలంగాణ ఆరోపిస్తోంది. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం తెలంగాణ తన వాటాను నాగార్జునసాగర్ లో భద్రపరచుకొని మరుసటి సంవత్సరం వాడుకుంటామని (క్యారీ ఓవర్) అంటే.. అందుకు ఏపీ సర్కారు నిరాకరిస్తోంది.

click here to read 2025 హైలెట్స్ ఇవే !!

click here to read more news

Leave a Reply