కోమటిరెడ్డి బ్రదర్స్‌పై చేస్తున్న విమర్శలు పూర్తిగా నిరాధారం

కోమటిరెడ్డి బ్రదర్స్‌పై చేస్తున్న విమర్శలు పూర్తిగా నిరాధారం
మునుగోడు, ఆంధ్రప్రభ : కోమటిరెడ్డి బ్రదర్స్‌పై కొందరు చేస్తున్న విమర్శలు పూర్తిగా నిరాధారమని చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమనపల్లి సైదులు తీవ్రంగా ఖండించారు. శనివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించే కృషిని చూసి అసూయతో కొందరు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
ప్రాజెక్టులతో పురోగతి
బ్రాహ్మణవెల్లంల నీటిపారుదల ప్రాజెక్టు అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి విశేషమని తెలిపారు.ఎడమ కాలువను ఉరుమడ్ల నుంచి కిష్టాపురం వరకు విస్తరించడం రైతులకు లాభదాయకమని పేర్కొన్నారు. గత వేసవిలో స్వంత నిధులతో కాలువ తవ్వించి చెరువులకు నీరు అందేలా చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు.నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో రిటైర్డ్ ఇంజనీర్లతో సమీక్షలు నిర్వహిస్తూ డీపీఆర్ సిద్ధం చేస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతూ నిధులు సమీకరిస్తున్నారని వివరించారు. విద్య, వైద్యానికి ప్రాధాన్య మిస్తూ కబ్జా సమస్యలో ఉన్న భూమిని రక్షించి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి మార్గం సుగమం చేశారని, మర్రిగూడ మండలంలోని కస్తూరిబా పాఠశాల అభివృద్ధికి స్వంత నిధులు వినియోగించారని చెప్పారు. సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ పేదలకు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై అవాస్తవ ఆరోపణలు చేయకుండా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు.అభివృద్ధి అంశాలపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
