Warned | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : దేవనకొండ మండలం మాచాపురం అంగన్వాడీ కేంద్రం పని తీరు పట్ల జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సక్రమంగా విధులు నిర్వహించకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. మంగళవారం దేవనకొండ మండలం మాచాపురం గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తూ అంగన్వాడీ కేంద్రంలో ఒకే ఒక్క చిన్నారి ఉండడంతో ఉదయం 9.30 గంటలు అవుతున్నప్పటికీ ఎందుకు పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో లేరని కలెక్టర్ అంగన్వాడీ టీచర్ ను ప్రశ్నించారు.
అంగన్వాడీ కేంద్రంలో ఉన్న ఆ పాప ఏ, బి, సి, డీ లు కూడా చెప్పలేకపోవడంతో పిల్లలకు ఏమి పాఠాలు నేర్పిస్తున్నారని కలెక్టర్ అంగన్వాడీ టీచర్ ను ప్రశ్నించారు. స్టాక్ రిజిస్టర్ నిర్వహించకపోవడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పని తీరు మార్చుకోవాలని, సక్రమంగా విధులు నిర్వహించని అంగన్వాడీ సిబ్బంది పై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. బాత్రూమ్ లను యాసిడ్ తో శుభ్రం చేయించాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం అక్కడే ఉన్న గ్రామస్థులతో కలెక్టర్ మాట్లాడుతూ.. సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా.? పెన్షన్ ఇంటి వద్దకే వచ్చి అందిస్తున్నారా.? పెన్షన్ ఇచ్చే సమయంలో డబ్బులు వసూలు చేస్తున్నారా.? ప్రతి రోజు పారిశుధ్య సిబ్బంది ఇంటి వద్దకి వచ్చి చెత్త సేకరణ చేస్తున్నారా.? అని గ్రామస్థులను ఆరా తీశారు. పెన్షన్ ఇంటి వద్దకే వచ్చి అందిస్తున్నారని.. పెన్షన్ ఇచ్చే సమయంలో డబ్బులు వసూలు చేయడం లేదని.. ప్రతి రోజు పారిశుధ్య సిబ్బంది ఇంటి వద్దకి వచ్చి చెత్త సేకరిస్తున్నారని.. సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉంటున్నారని గ్రామస్తులు కలెక్టర్ కి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి విజయ, సిడిపిఓ సూపర్వైజర్ తదితరులు పాల్గొన్నారు.

