తెనాలి, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట ప్రకారం డీఎస్సీ పూర్తి చేసిందని, నూతన ఉపాధ్యాయులు బాధ్యతగా పని చేయాలని శాసన మండలి సభ్యులు, తెనాలి టీడీపీ ఇంచార్జీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు.
ఆదివారం తెనాలి సుల్తానాబాద్ ఏరియాలోని సాయికుమార్ మందిర ప్రాంగణంలోని సమావేశపు మందిరంలో తెనాలి నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు కోగంటి రోహిత్ ఆధ్వర్యంలో నూతన ఉపాధ్యాయులులకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు.
ముఖ్య అతిథి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో భావి తర పౌరులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే అని ఉపాధ్యాయుల తరువాతే దైవం అని రానున్న తరాలు దేశ భక్తితో బాధ్యతగా మసలుకోవాలంటే ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అంటూ కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగా డీఎస్సీ నిర్వహించి నిరుద్యోగుల కలలు సాకారం చేసిందని ఇది మొదలు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహించి తీరుతామని భరోసా ఇచ్చారు.
కోగంటి రోహిత్ మాట్లాడుతూ విద్యార్ధులు మంచి నడవడికతో సమాజంలో తల్లిదండ్రుల పట్ల,పెద్దల పట్ల గౌరవ భావంతో నడుచుకోవాలంటే ఉపాధ్యాయుల వల్లే అవుతుందని అన్నారు. ఆ సభలో ఉపాధ్యాయ నియామకాలు పొందిన ఉద్యోగులు పలువురు మాట్లాడుతూ ఓటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేర్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఉపాధ్యాయ నియామక పాత్రలు అందించే సభలో ఉపాధ్యాయుల పేరుతో కుర్చీలను ఏర్పాటు చేసి సముచితంగా గౌరవించిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనన్నారు. ఉపాధ్యాయ నియామకల్లో విద్యాశాఖ మంత్రి లోకేష్ చేసిన కృషిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. బాధ్యతగా పనిచేస్తామన్న అభిప్రాయాన్ని వెల్లడించారు.
అనంతరం నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో తెనాలి పట్టణ, మండల,కొల్లిపర మండల పార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఖుద్దూస్, చిన్న కోటిరెడ్డి,నల్లిబోయిన నాగేశ్వరరావు, కేసన కోటేశ్వరరావు,కోగంటి రోహిత్, శాఖమూరి సురేంద్ర,డా.వేమూరి శేషగిరిరావు,ఫణిదపు దుర్గ, వెంకటేశ్వరరావు,వసంతం అశోక వర్ధన, మొవ్వ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి వాగ్దానాన్ని నెరవేరుతోంది : ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్
డీఎస్సీలో ఉద్యోగ నియామకాలు పొందిన వారిని సత్కరించి అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ వైసిపి పాలకులు రాష్ట్రాన్ని దివాలా తీసే దశకు చేర్చారని ఆ ఆర్థిక ఇబ్బందులను సైతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరిస్తూ ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారని తెలిపారు.
గతంలో 9 సార్లు కరెంటు చార్జీలు పెంచితే కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ పేరుతో యూనిట్‌కు 13 పైసలు కరెంటు చార్జీలు తగ్గించిందని తెలిపారు. మెగా డీఎస్సీ ని నిలుపుదల చేయాలని కొందరు 39 కేసులు పెట్టి ఆటంకాలు సృష్టించినప్పటికీ అన్నిటినీ అధిగమించి మెగా డీఎస్సీని కూటమి ప్రభుత్వం నిర్వహించిందన్నారు.
కేవలం 150 రోజులలోనే డీఎస్సీని పూర్తి చేసి ఎంపికైన ఉపాధ్యాయులకు త్రోపత్రాలు లాంఛనంగా అందించి పనిచేసే పాఠశాలను సైతం కేటాయించిందన్నారు. ఈ ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కే దక్కుతుందన్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టినట్టునుండి నేటి వరకు ఎనిమిది సార్లు డీఎస్సీ నిర్వహించి వేలమంది నిరుద్యోగులను ఉపాధ్యాయులుగా నియామకాలు చేసిందన్నారు. డీఎస్సీ 2025 ను అత్యంత పారదర్శకంగా అవినీతికి సిఫార్సులకు తావు లేకుండా నిర్వహించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు.
మీడియా సమావేశంలో తెలుగు యువత తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు కోగంటి రోహిత్, తెజప తెనాలి పట్టణ అధ్యక్షుడు కుద్దూస్, మండల విద్యాశాఖ అధికారులు మేకల లక్ష్మీనారాయణ, జయంతి బాబు, సుంకర హరికృష్ణ, పిడి బుజ్జి, కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు ఉన్నారు.