Warangal | రాజ్యాంగ హక్కులకు లోబడి పనిచేయాలి

Warangal | రాజ్యాంగ హక్కులకు లోబడి పనిచేయాలి

భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం
భారత్ రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శం
వరంగల్ అడిషనల్ డిసిపి రవి
కమిషనరేట్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు


Warangal | వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : రాజ్యాంగం కల్పించిన హక్కులకు లోబడి పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని వరంగల్ పోలీస్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ (అడ్మిన్) రవి (Ravi) పేర్కొన్నారు. హద్దులు దాటకుండా చట్టాలను గౌరవిస్తూ పోలీసులు మున్ముందు కూడా పని చేయాలన్నారు. పోలీసులు ప్రజా సేవకులేనని గుర్తు చేసుకొంటూ పనిచేయాలని అడిషనల్ డీసీపీ (అడ్మిన్) రవి సూచించారు.

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని వరంగల్ పోలీస్ కమిషనరేట్ (Warangal Police Commissionerate) కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనరేట్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో అదనపు డీసీపీ రవి, బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలవేశారు. అనంతరం అధికారులు, సిబ్బంది చేత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్బంగా అదనపు డీసీపీ రవి (DCP Ravi) మాట్లాడుతూ… ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ విరాజిల్లుతోందన్నారు. మన దేశ రాజ్యాంగానికి ప్రత్యేక గుర్తింపు వుందన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, దేశ అభివృద్ధికి కట్టుబడి వుండాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరు గౌరవించాలని అడిషనల్ డీసీపీ రవి సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు రాయల ప్రభాకర్ రావు, బాల స్వామి, సురేష్ కుమార్, శ్రీనివాస్, ఏసీపీలు డాక్టర్ మూల జితేందర్ రెడ్డి, జానీ నర్సింహులు, డేవిడ్ రాజు, నాగయ్య, గిరికుమార్, సురేంద్ర, ఏ.ఓ సంపత్ కుమార్ తో పాటు ఆర్.ఐలు, ఇన్‌ స్పెక్టర్లు, ఇతర పోలీస్, పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply