Wajedu |ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి – వార్డెన్ నిర్లక్ష్యమే అంటున్న బంధువులు
వాజేడు ఫిబ్రవరి 16 ఆంధ్రప్రభ:జ్వరంతో బాధపడుతూ ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుంది.
బంధువులు తెలిపిన వివరాల ప్రకారం పేరూరు ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సోయం వినీత్ (14) అనే విద్యార్థికి మంగళవారం జ్వరం వచ్చింది. అక్కడి హెల్త్ వర్కర్ జ్వరం టాబ్లెట్ ఇవ్వడంతో ఆ పూటకు జ్వరం తగ్గింది. రెండు రోజులు సెలవు రావడంతో ఆ విద్యార్థి ని ఇంటికి పంపించారు.
ఇంటికి పంపిన తర్వాత మరల జ్వరం రావడంతో తన మేనమామ శ్రీకాంత్ ధర్మవరం ఆర్.ఎం.పి వద్ద వైద్యం చేయించారు. అయినప్పటికీ తగ్గకపోగా కడుపులో నొప్పి రావడంతో ఏటూరు నాగారం వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
మృతుడి తల్లి శైలజ హైదరాబాదులో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుంది. తండ్రి ఈ విద్యార్థి చిన్నతనంలోని కుటుంబాన్ని వదిలేశాడు. వార్డెన్ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా వైద్యం ముందే అందించినట్లయితే విద్యార్థి చనిపోయేవాడు కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనతో పేరూరు ఆశ్రమ పాఠశాల విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు