Vision | విజన్ 2047 వైపు దూసుకెళ్తున్న బడ్జెట్…

Vision | విజన్ 2047 వైపు దూసుకెళ్తున్న బడ్జెట్…
Vision | విజయవాడ, ఆంధ్రప్రభః రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ నెట్టెం రఘురాం స్పందిస్తూ, ఈ బడ్జెట్ రాష్ట్రాన్ని దీర్ఘకాలిక అభివృద్ధి పథంలో నడిపించే దిశానిర్దేశక ఆర్థిక సంస్కరణల పత్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇది కేవలం లెక్కల పత్రం కాదు, ప్రజల భవిష్యత్తును రూపుదిద్దే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అని అన్నారు.
వ్యవసాయం, పరిశ్రమలు, సాగునీరు, విద్య, ఆరోగ్యం, పంచాయతీరాజ్, మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక రంగాలకు సముచిత కేటాయింపులు చేయడం ద్వారా ప్రభుత్వం సమతుల్య అభివృద్ధి దిశగా అడుగులు వేసిందన్నారు. వెనుకబడిన వర్గాల సాధికారతకు ప్రత్యేక నిధులు కేటాయించడం సామాజిక న్యాయానికి నిదర్శనమని తెలిపారు. రూ.3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లను ఆయన అభినందించారు.
రాష్ట్ర భవిష్యత్ వృద్ధికి అవసరమైన మూలధన వ్యయానికి రూ.53,915 కోట్లు కేటాయించడం అభివృద్ధి దృక్పథానికి నిదర్శనమన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,598 కోట్లు, సాగునీటి ప్రాజెక్టులకు రూ.18,224 కోట్లు కేటాయించడం రైతుల సంక్షేమంపై ప్రభుత్వ కట్టుబాటును స్పష్టం చేస్తోందన్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,600 కోట్లు కేటాయించడం రైతులకు ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి రూ.11,000 కోట్లు కేటాయించడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తుందని చెప్పారు. పేదల గృహావసరాలను తీర్చేందుకు గృహనిర్మాణానికి రూ.6,357 కోట్లు కేటాయించడం సామాజిక భద్రతను మరింత బలోపేతం చేస్తుందన్నారు.
మొత్తం సంక్షేమ కార్యక్రమాలకు రూ.91,527 కోట్లు కేటాయించగా, బీసీలకు రూ.51,021 కోట్లు, ఎస్టీలకు రూ.9,190 కోట్లు, మైనార్టీలకు రూ.6,090 కోట్లు, మహిళా,శిశు,వికలాంగుల సంక్షేమానికి రూ.4,582 కోట్లు కేటాయించడం సమగ్రాభివృద్ధి లక్ష్యానికి అనుగుణమని వివరించారు. విద్యా రంగంలో పాఠశాల విద్య నుండి ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి వరకు గణనీయ నిధులు కేటాయించడం రాష్ట్ర భవిష్యత్ తరాలకు పెట్టుబడి పెట్టడమేనన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు రూ.27,719 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.22,942 కోట్లు, వైద్యశాఖకు రూ.19,306 కోట్లు కేటాయించడం గ్రామీణ,నగర సమతుల్యాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.
ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ వడ్డీభారాన్ని నియంత్రించడం ప్రశంసనీయమన్నారు. వివిధ శాఖల్లో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు విస్తరించాయని చెప్పారు. విజన్ 2047 లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులను ఆకర్షిస్తూ రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి దిశగా నడిపించే శక్తివంతమైన ప్రజా బడ్జెట్ ఇదేనని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం పేర్కొన్నారు..
