Vijayawada | క్యాటరర్స్ అసోసియేషన్‌కు స్థలం కేటాయించాలి

Vijayawada | క్యాటరర్స్ అసోసియేషన్‌కు స్థలం కేటాయించాలి

  • ఆహార రంగానికి ప్రభుత్వ గుర్తింపు అవసరం..
  • ఎన్‌టీఆర్, కృష్ణా జిల్లా క్యాటరర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు పల్లపోతు దిలీప్

Vijayawada | విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా సాగుతోందని, ఇదే సందర్భంలో ఆహార రంగంలో విశేష సేవలు అందిస్తున్న క్యాటరర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుబంధ సంస్థకు రాజధాని అమరావతిలో కార్యకలాపాలు నిర్వహించేందుకు అనువైన స్థలాన్ని కేటాయించి ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలని ఎన్‌టీఆర్,కృష్ణా జిల్లా క్యాటరర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు పల్లపోతు దిలీప్ కోరారు.

నగరంలోని ఓ ప్రముఖ కళ్యాణ మండపంలో నిర్వహించిన అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి నూతన కమిటీని గౌరవంగా సత్కరించారు. పల్లపోతు దిలీప్ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా క్యాటరర్స్ అసోసియేషన్ ఆహార రంగంలో తనదైన ముద్ర వేసిందని, నాణ్యమైన సేవలతో ఆహార ప్రియులకు నూతన వంటకాలను పరిచయం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిందన్నారు.

ఈ సంస్థను నమ్ముకుని వందలాది నిరుపేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, క్యాటరింగ్ రంగం ద్వారా ఎంతో మందికి ఉపాధి కలుగుతోందని తెలిపారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రానున్న కాలంలో పేదలకు భోజన సేవలు, శిక్షణ శిబిరాలు వంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గౌరవ మాజీ అధ్యక్షుడు శివాజీ, ఖజాంచి ప్రసాద్, ఉపాధ్యక్షుడు మామిడి శ్రీనివాసరావు, పులికొండ సునీల్ కుమార్, గుండ అయ్యప్ప, నాగ కన్య, సతీష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply