Vijayawada | పాదయాత్ర ప్రకటనతో కూటమిలో అలజడి..

Vijayawada | పాదయాత్ర ప్రకటనతో కూటమిలో అలజడి..

  • ఏపీ మొదలైన రాజకీయ ప్రకంపనలు..
  • ప్రజల్లో తిరిగి విశ్వాసం తెచ్చేలా..
  • ప్రజా సమస్యలే అజెండాగా సాగనున్న యాత్ర
  • దివ్యాంగుల సంక్షేమానికి జగన్ పాలనే ఆదర్శం..
  • వైసిపి దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పి దుర్గారెడ్డి

Vijayawada | జయవాడ, ఆంధ్రప్రభ : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారి తీస్తుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఈ పాదయాత్రతో కూటమి ప్రభుత్వానికి ముందుగానే రాజకీయ అలజడి మొదలైందన్నారు.

2019కు ముందు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజల మధ్యే నడుచుకుంటూ సాగిన జగన్ పాదయాత్ర చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు. ఆ యాత్రలోనే నవరత్నాల సంక్షేమ హామీలను ప్రకటించి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అమలు చేసి చూపిన నాయకుడు జగన్ మాత్రమేనన్నారు. ప్రజల నమ్మకానికి ప్రతిరూపంగా నిలిచిన ఆ పాదయాత్ర రాష్ట్ర రాజకీయ దిశనే మార్చిందన్నారు. ఇప్పుడు మళ్లీ ప్రజల వద్దకే వెళ్లాలని జగన్ తీసుకున్న నిర్ణయం ప్రజల్లో విశేష స్పందనను రేపుతోందన్నారు.

గత రెండేళ్లుగా రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలనతో రైతులు, కార్మికులు, మహిళలు, యువత, దివ్యాంగులు సహా అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాలు నిలిచిపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని, మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. జగన్ పాలనలో దివ్యాంగులకు సముచిత గౌరవం, భరోసా లభించిందని దుర్గారెడ్డి పేర్కొన్నారు. నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో పెరిగిన దివ్యాంగుల పెన్షన్లు, ఉచిత వైద్య సాయం, విద్యా ప్రోత్సాహకాలు వారి జీవితాల్లో వెలుగులు నింపాయని చెప్పారు.

దివ్యాంగ కుటుంబాలు గౌరవంగా జీవించేందుకు జగన్ ప్రభుత్వం చేసిన కృషిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. అలాగే విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలతో పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య, ఉచిత పుస్తకాలు, యూనిఫాంలు, స్కూల్ కిట్లు అందడంతో పేద కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొందన్నారు. ఆ రోజులు తిరిగి రావాలని ప్రజలు స్పష్టంగా కోరుకుంటున్నారని తెలిపారు. ఈసారి జరిగే పాదయాత్ర సాధారణ రాజకీయ యాత్ర కాదని, ప్రజల ఆకాంక్షల ప్రతిబింబంగా మారుతుందని దుర్గారెడ్డి వ్యాఖ్యానించారు.

జగన్మోహన్ రెడ్డి ఈ యాత్రను నడిపించడమే కాదు, ప్రజలే ముందుండి ఈ పాదయాత్రను నడిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు, ఆదరణే ఈ యాత్రకు ప్రధాన శక్తిగా మారుతుందన్నారు. జగన్ పాదయాత్ర ప్రకటన వెలువడినప్పటి నుంచే కూటమి ప్రభుత్వ నేతల్లో గుబులు మొదలైందని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక అలజడికి లోనవుతున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో ఈ పాదయాత్ర ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుని రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుందన్నారు. 2029 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని అందించడంలో ఈ పాదయాత్ర కీలక పాత్ర పోషిస్తుందని దుర్గారెడ్డి పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.

Leave a Reply