Vijayawada | ఇంద్రకీలాద్రిపై వైభవంగా గోపూజ మహోత్సవం

Vijayawada | ఇంద్రకీలాద్రిపై వైభవంగా గోపూజ మహోత్సవం
- శాస్త్రోక్తంగా పూజలు
Vijayawada | (ఇంద్రకిలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో గోపూజ మహోత్సవం అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా ఇవాళ నిర్వహించారు. కొండపైని చిన్న రాజగోపురం సమీపంలో జరిగిన ఈ పవిత్ర కార్యక్రమంలో దేవస్థాన పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కే.శీనా నాయక్‌తో పాటు పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో వేద పండితులు సంప్రదాయబద్ధంగా గోపూజ నిర్వహించారు.

గోమాతకు పసుపు, కుంకుమలతో శాస్త్రోక్తంగా అలంకరణ చేసి, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ జరిగిన ఈ పూజ భక్తులను ఆధ్యాత్మికంగా పరవశింపజేసింది. ఈ సందర్భంగా చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ… హిందూ సంప్రదాయంలో గోమాతకు ఉన్న విశిష్ట స్థానాన్ని గుర్తు చేశారు. గోమాత సాక్షాత్తు సర్వదేవతామయమని పేర్కొంటూ, గోపూజ ద్వారా లోకకళ్యాణం, పాడిపంటల సమృద్ధి కలుగుతుందని తెలిపారు. లోక శ్రేయస్సు, వ్యవసాయాభివృద్ధి, సమృద్ధి కోసం ఈ గోపూజ మహోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించినట్లు ఆలయ ఈఓ శీనానాయక్ వెల్లడించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు గోమాతను దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
