నంద్యాల బ్యూరో, జులై 14 (ఆంధ్రప్రభ) : నంద్యాల (Nandyala) జిల్లా కేంద్రంలో నకిలీ ఎరువులకు అడ్డాగా మారింది. గతంలో పలు ఎరువుల దుకాణాల్లో ఆనాటి జిల్లా కలెక్టర్ డాక్టర్ మణిజీర్ జిలాని సామాన్ ఆకస్మిక దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయి. నంద్యాల జిల్లా కేంద్రంలో నకిలీ విత్తనాలు నకిలి ఎరువులకు నిలయంగా మారిందని నంద్యాల జిల్లా నుంచి పలువురు రాష్ట్రస్థాయికి అనేక ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల పరంపర మేరకు సోమవారం కమిషనర్ అండ్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ (Commissioner and Director, Department of Agriculture) ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ఎరువుల దుకాణాలపై రాష్ట్రస్థాయి విజిలెన్స్ తనిఖీ (Vigilance inspection) బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఎరువుల దుకాణాల వద్ద సరైన ధ్రువ పత్రాలు లేని ఎరువులు రూ.1.54 లక్షల విలువ గల వాటిని సీజ్ చేశారు.
జిల్లాలోని పలు పురుగుమందులు, ఎరువుల దుకాణాలను, విత్తన దుకాణాలను, విత్తన శుద్ధి కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో రాష్ట్ర స్థాయి తనిఖీ బృందం, సహాయ వ్యవసాయ సంచాలకులు కమలాపురం నరసింహారెడ్డి, విజిలెన్స్ డిఎస్పి అనంతపురం నాగభూషణం, మండల వ్యవసాయ అధికారి ప్రసాద రావుతో కలిసి పలు విత్తన ఎరువుల, పురుగుమందుల దుకాణాల్లో, గోడౌన్లలో తనిఖీ చేశారు. విత్తనాలు, ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ లను, వివిధ రకాల అనుమతి పత్రాలను పరిశీలించారు. ఈ తనిఖీలో భాగంగా న్యూ వసువాహిని ఆగ్రో ఏజెన్సీస్ లో రూ.84 వేల విలువైన ఎరువులు, శివ సంతోష్ రెడ్డి ఏజెన్సీస్ లో రూ.70వేల విలువైన ఎరువులను సీజ్ చేశారు. సరైన ధ్రువపత్రాలు చూపించినందున తాత్కాలిక అమ్మకపు నిలుపుదల చేయడం జరిగిందన్నారు. రాష్ట్రస్థాయి తనిఖీ బృందం నరసింహారెడ్డ్డి, నాగభూషణంలు మాట్లాడారు. విత్తన చట్టం, ఎఫ్ సి ఓ 1985 చట్టం ప్రకారం వ్యాపారం నిర్వహించుకోవాలని దుకాణదారులకు సూచించారు. దుకాణాలలో, గోడౌన్లలో స్టాక్ నిలువలను ప్రతిరోజూ మండల వ్యవసాయ అధికారులకు తెలియజేయాలన్నారు.
అలాగే స్టాక్ రిజిస్టర్లు, స్టాక్ బోర్డులను ప్రతిరోజూ అప్డేట్ చేయాలన్నారు. ఎరువులను, విత్తనాలను, పురుగుమందులను ఎం ఆర్ పి ధరల కంటే అధికంగా విక్రయించరాదన్నారు. ఎరువులు, విత్తనాలు కొన్న ప్రతి రైతుకు రసీదు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను మాత్రమే విక్రయించాలని దుకాణదారులను హెచ్చరించారు. జిల్లాకు కేటాయించిన ఎరువులను జిల్లాలోనే విక్రయించాలని, జిల్లా దాటి అక్రమ మార్గంలో బయటపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
విత్తనశుద్ధి కేంద్రాల యజమానులు ఫౌండేషన్ రిజిస్టర్, మొలకశాతం రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ నిర్వహించాలన్నారు. ప్రాసెసింగ్ చేసేటప్పుడు విత్తనాలు కల్తీ జరగకుండా జాగ్రత్తగా ప్రాసెసింగ్ చేయాలని, విత్తనం సమాచారం అంతా విత్తనాల సంచిపై ఉండే విధంగా నిర్వహించుకోవాలన్నారు. నిబంధనలు పాటించని, చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా వ్యాపారం నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్తులో ఈ ఆకస్మిక తనిఖీలు నిరంతరంగా జరుగుతాయని తెలిపారు.

