VHR Foundation | రామగుండంలో అభివృద్ధి కాదు.. కూల్చివేతలే..

VHR Foundation | రామగుండంలో అభివృద్ధి కాదు.. కూల్చివేతలే..
- వ్యాల్ల హరీష్ రెడ్డి
- దౌర్జన్య పాలనకు ముగింపు పలకాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి…
VHR Foundation | గోదావరిఖని టౌన్ ఆంధ్రప్రభ : గత రెండేళ్లుగా రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్య పాలన కొనసాగిస్తూ అక్రమ కూల్చివేతలకే పరిమితమయ్యారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, విహెచ్‌ఆర్ ఫౌండేషన్(VHR Foundation) వ్యవస్థాపకులు వ్యాల్ల హరీష్ రెడ్డి ఆరోపించారు. శనివారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇక్కడ ఎలాంటి మాస్టర్ ప్లాన్ లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా అర్థరాత్రి బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 46 మైసమ్మ గుళ్లను కూల్చివేశారని ఆరోపిస్తూ, ఇదేనా ప్రజాస్వామ్య పాలన అంటూ ప్రశ్నించారు.
సొంత నిధులు 20కోట్ల రూపాయలతో హనుమాన్ గుడి నిర్మిస్తున్నామని చెప్పుకుంటూ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నేతల ఆదేశాల మేరకే కూల్చివేతలు చేపడుతున్నారని, ప్రజలకు వివరణ ఇవ్వడానికి వారికి మొఖం లేదన్నారు. రెండు సంవత్సరాలుగా కూల్చివేతలు, దౌర్జన్యాలు కొనసాగుతున్నప్పటికీ అధికారులు మౌనం పాటిస్తున్నారని ఆరోపించారు.
VHR Foundation | సింగరేణి కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం…
ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని హరీష్ రెడ్డి విమర్శించారు. సొంతింటి కల, మారుపేర్ల సమస్యలు, కారుణ్య నియామకాల డిపెండెంట్ మెడికల్(Dependent Medical) బోర్డు నిర్వహణ వంటి అంశాల్లో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. ఈ నిర్లక్ష్య ధోరణి కార్మికుల ఉసురును తాకుతుందని హెచ్చరించారు.
VHR Foundation | ఎన్‌టీపీసీ బూడిద దందాపై ఆరోపణలు..
ఎన్‌టీపీసీ బూడిద పేరుతో అక్రమ దందా సాగుతోందని, దీని ద్వారా వందల కోట్ల రూపాయల అక్రమ ఆదాయం పొందుతున్నారని ఆరోపించారు. స్థానికుల ఉపాధిని దెబ్బతీస్తూ, పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచకం చేస్తున్నారని అన్నారు. ఈ వ్యవహారాన్ని హైదరాబాద్, న్యూఢిల్లీలో ఆందోళనల ద్వారా ఎండగడతామని స్పష్టం చేశారు.
2023లో రామగుండంలో ఐటీ టవర్ కోసం అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంజూరు చేసిన రూ.25 కోట్ల(Rs. 25 crore) రూపాయల నిధులు ఎక్కడికి వెళ్లాయో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదని, అభివృద్ధి పేరుతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని విమర్శించారు.

లక్ష్మీనగర్‌లో ఒక్కో వ్యాపారికి కనీసం ఐదు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని, ఇదేనా అభివృద్ధి అని ప్రశ్నించారు. పవర్ ప్రాజెక్టుల పేరుతో వేలకోట్ల రూపాయల ప్రచారం చేస్తూ ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించాలని అన్నారు. పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న రామగుండం కాలుష్య కోరల్లో చిక్కుకుందని, గుండెపోటు, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్(Cancer), కిడ్నీ సమస్యలతో రోజూ మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు.
VHR Foundation | పోలీసుల వ్యవహారంపై ప్రశ్నలు…
అంతర్గాం, పాలకుర్తి మండలాల్లో పోలీసులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే(MLA) సతీమణికి ఎలాంటి అధికారిక హోదా లేకపోయినా పోలీసు ఎస్కార్ట్ కల్పించడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు. రామగుండంలో రెండేళ్లుగా కొనసాగుతున్న కాంగ్రెస్ కూల్చివేతల దౌర్జన్య పాలనకు ముగింపు పలకాలంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి మేయర్ సీటును కైవసం చేసుకోవాలని ప్రజలకు హరీష్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మాజీ కో-ఆప్షన్ మెంబర్ తస్లీమా భాను, మాజీ కార్పొరేటర్లు అయిత శివ, అడ్డాల గట్టయ్య, రవి నాయక్, బొబ్బిలి సతీష్, బక్కీ కిషన్, మాజీ కౌన్సిలర్ కృష్ణస్వామి, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జహీద్ పాషా, తదితరులు పాల్గొన్నారు.
