Venezuela | వెనెజువెలాలో భారీ పేలుళ్లు

Venezuela | వెనెజువెలాలో భారీ పేలుళ్లు

Venezuela | ( ఆంధ్రప్రభ, కారకస్ ) : ఆదమరిచి నిద్దరోతున్న వేళ.. ఆకాశం గర్జించింది. విమానాలు, హెలికాప్టర్లు విరుచుకుపడ్డాయి. బాంబుల వర్షం కురిసింది. అంతే.. వెనిజులా రాజధాని కారకస్ (Caracas) కకావికలమైంది. శనివారం (జనవరి 3, 2026) తెల్లవారుజామున వరుస పేలుళ్లు మార్మోగాయి. అసలు అక్కడ ఏం జరిగింది? కారకస్ కాలమానం ప్రకారం, తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో కారకస్‌లో 7 భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఈ సమయంలో ఆకాశంలో విమానాలు, హెలికాప్టర్లు తక్కువ ఎత్తులో ఎగురుతూ కనిపించాయి. నగరంలోని ప్రధాన సైనిక స్థావరం ‘ఫోర్ట్ టియునా’ (Fort Tiuna) ‘లా కార్లోటా’ (La Carlota) ఎయిర్‌పోర్ట్ సమీపంలో పేలుళ్లు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో భారీగా పొగలు అలుముకున్నాయి.

పేలుళ్ల ధాటికి భవనాలు, కిటికీలు కంపించాయి. జనం తీవ్ర భయాందోళనకు గురై వీధుల్లోకి పరుగులు తీశారు. పేలుళ్ల తర్వాత నగరంలోని దక్షిణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వెనిజులాపై భూతల దాడులు (ground strikes) చేసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన కొద్ది రోజుల్లోనే ఈ పేలుళ్లు జరగడం గమనార్హం. వెనిజులా ప్రభుత్వం డ్రగ్ స్మగ్లింగ్‌కు పాల్పడుతోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ ఘటనపై వెనిజులా ప్రభుత్వం, అమెరికా రక్షణ శాఖ (Pentagon) ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.

Leave a Reply