VB-G Ram-G | “వీబీ జీ రామ్ జీ” వద్దే వద్దు

VB-G Ram-G | “వీబీ జీ రామ్ జీ” వద్దే వద్దు
పార్లమెంట్ ఎదుట తెలంగాణ ఎంపీల నిరసన
జాతిపిత పేరు తొలగింపును వ్యతిరేకిస్తూ విపక్ష ఎంపీలతో కలిసి పోరు
VB-G Ram-G | న్యూఢిల్లీ-ఆంధ్రప్రభ ప్రతినిధి : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం (ఎంజీఎన్ఆర్ జీఏ)ను రద్దు చేసి వికసిత్ భారత్ రోజ్ గార్, ఆజీవికా హామీ మిషన్ గ్రామీణ్ ( వీబీ-జీ రామ్ జీ ) (VB-G Ram-G) బిల్లు -2025ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టడాన్ని తెలంగాణ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో (Parliament winter session) భాగంగా గురువారం కాంగ్రెస్ అధిష్టానం పిలుపుమేరకు ఆ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ, విపక్ష ఎంపీలతో కలిసి పార్లమెంట్ ఎదుట నిరసన తెలిపారు. ఉపాధి హామీ పథకం రద్దు, జాతిపిత మహాత్మాగాంధీ పేరు తొలగింపును తీవ్రంగా ఖండించారు. నిధుల ఆర్థిక భారాన్ని రాష్ట్రాలపై వేయబోతున్న వీబీ జీ రామ్ జీ (VB-G Ram-G) పథకం వద్దే వద్దు అంటూ.. ప్లకార్డులు చేతబట్టి నినాదాలతో హోరెత్తించారు. పేద రాష్ట్రాలు ఆర్థిక భారాన్ని భరించలేవని, పేదలకు అండగా నిలుస్తున్న ఈ పథకాన్ని చివరకు రద్దు చేయాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఇకనైనా తన తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీలు మల్లు రవి, శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి, బలరాం నాయక్, తదితరులు పాల్గొన్నారు.
