30వ తేదీన వైకుంఠ ఏకాదశి – ఉత్తర ద్వార దర్శనం..

ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీకాకుళేశ్వరస్వామివారి దేవస్థానంలో ఈ నెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఉపకమిషనర్, కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన వివరాలు వెల్లడించారు. 30వ తేదీ ఉదయం సుప్రభాత సేవ, విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, నవగ్రహారాధన, స్వామి, అమ్మవార్లకు సహస్రనామార్చన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్లకు ఆస్థాన పూజా కార్యక్రమం జరుగుతుందని, ఉదయం 11.16 నిమిషాలకు స్వామి, అమ్మవార్లు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారని పేర్కొన్నారు.
అనంతరం గరుడ వాహనంపై గ్రామోత్సవం, రాత్రి 8 గంటలకు రాజాధిరాజ వాహనంపై గ్రామోత్సవం, అర్జిత సేవలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
