బందరులో మహా దసరా సంబరం
- కలకత్తా కాళీకి ప్రత్యేక పూజలు
- 25 శక్తి పటాలాలు సిద్ధం
మచిలీపట్నం, ఆంధ్రప్రభ ప్రతినిధి : ఈ దసరా పండుగ దుర్గాదేవి(Goddess Durga)కి అంకితం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక గా ఈ పండుగ జరుపుతారు. ఈ దసరా పండుగ(festival) సందర్భంగా మచిలీపట్నానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రత్యేక ఆచారాలతో సాంప్రదాయాలతో ఈ పండుగను బందరు ప్రజలు ఘనంగా జరుపుతారు. దసరా పండగ, దేవీ నవరాత్రుల(Goddess Navratri) పేరుతో తొమ్మిది రోజులు అమ్మవారిని శక్తి పఠాల రూపంలో వేషం ధరించి నవరాత్రులు నిర్వహిస్తారు.
నవరాత్రులు పండుగ సందర్భంగా మచిలీపట్నంలో పలుచోట్ల దుర్గాదేవీ విగ్రహాలను ఏర్పాటు చేస్తారు మరి కొన్నిచోట్ల దుర్గామాత వేషం ధరించి శక్తి పటం రూపంలో ప్రత్యేక పూజలు చేస్తారు.
శక్తి పటం ఆవిష్కరణ ఇలా..
అసలు మచిలీపట్నంలో ఈ శక్తి పటాలు సంస్కృతి పరిచయం చేసింది మూడు తరాల క్రితం బొందిలి బుద్ధి సింగ్(Bondili Buddhi Singh) (దాదా) అనే వ్యక్తి మచిలీపట్నంలో కొలువైన ఈడేపల్లి శక్తి(Eidepalli Shakti) గుడి దేవాలయాన్నినెలకొల్పారు. మచిలీపట్నంలో దసరా మహోత్సవాలను నిర్వహించే విధానాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పురాతన ఆలయ స్థల పురాణం ప్రకారం మూడు తరాల కిందట క్రీస్తుశకం 1862 లో మచిలీపట్నంను బ్రిటిష్(British) పాలకులు పరిపాలిస్తున్న రోజులవి. హిందూ సంస్కృతి(Hindu Culture) సాంప్రదాయాలు తెలియని బ్రిటిష్ కాలంలో పశ్చిమ బెంగాల్ మిలటరీ ఉద్యోగిగా బొందిలి బుద్ధి సింగ్ (దాదా సింగ్)( Dada Singh) అనే మిలటరీ ఉద్యోగి అమ్మవారికి పరమ భక్తుడు. ప్రతిరోజు పశ్చిమ బెంగాల్ కలకత్తాలో అమ్మవారి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉండేవారు.
ఉద్యోగాన్నిమధ్యలోనే వదిలి తన సొంత గ్రామం మచిలీపట్నానికి వెళుతున్నసమయంలో బొందిలి బుద్ధి సింగ్ భక్తిశ్రద్ధలను కలకత్తా కాళీమాత మెచ్చి ఆయనతో పాటు మచిలీపట్నంకు వచ్చిందని ప్రచారం. దీనితో దాదా సింగ్ అమ్మవారి కి తాటి ఆకుల పందిరితో దేవాలయాన్నినిర్మించాడు.
బ్రిటిష్ కాలంలో ప్రస్తుతం మచిలీపట్నంగా పిలుస్తున్నబందరులో అనేక అంటూ వ్యాధులు ప్రబలి అనేకమంది ప్రజలు మృత్యువాత పడ్డారు. ప్రజల కోరికపై దాదా సింగ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అంటువ్యాధుల(Epidemics)ను ప్రబలకుండా అరికట్టడంతో బ్రిటిష్ పాలకులు మచిలీపట్నంలో ఈడేపల్లి లో అమ్మవారి దేవాలయానికి అనుమతించారు. అప్పుడు పూర్తి స్థాయిలో దేవాలయంను నిర్మించారు. దాదా సింగ్ కలకత్తా నుండి అమ్మవారి రూపంను తీసుకు వచ్చి ఈడేపల్లి సెంటర్ నందు అమ్మవారికి బ్రిటిష్ పాలకుల సహాయంతో దేవాలయం నిర్మించాడని భక్తుల నమ్మకం.
కలకత్తా కాళీగా… ప్రత్యేక పూజలు
అప్పట్లో దసరా పండుగకు ప్రసిద్ధి చెందింది కలకత్తా నగరం. దసరా పండగ సందర్భంగా ప్రత్యేక(Special) పూజలు నిర్వహించి, అనంతరం మచిలీపట్నంలో అమ్మవారికి పూజలు నిర్వహించేవారు. ఒకరోజు అమ్మవారు దర్శనంలో దాదా సింగ్ కు కలకత్తా తరహా దసరా ఉత్సవాలు జరిపించాలని అమ్మవారిని శక్తి పటం రూపంలో పూజించాలని ప్రవచించింది అప్పటినుండి నేటి వరకు 163 సంవత్సరాలుగా మొదటి తరం బొందిలి బుద్ధి సింగ్, రెండవ తరం దుర్గ సింగు(Durga Singh), మూడవ తరం హరిప్రసాద్ సింగ్, నాలుగవ తరం రవి కుమార్ సింగ్ ఇలా తరతరాలుగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు.
ప్రస్తుతం నాలుగోతరం రవికుమార్ సింగ్(Ravikumar Singh) వ్యవస్థాప కుటుంబానికి చెందినప్పటికీ మచిలీపట్నం నగరంలో ఈడేపల్లి సెంటర్ నందు దేవాలయంలో ప్రజలు అందరూ కలిసి పూజలు నిర్వహించి దసరా దేవీ నవరాత్రుల మహోత్సవాన్ని జరుపుతున్నారు. మచిలీపట్నంలో శక్తి పటాల చరిత్ర రూపం ఈ విధంగా మొదలయ్యింది. ప్రస్తుతం దేవీ నవరాత్రులలో 25 కు పైగా శక్తి పటాలు మచిలీపట్నంలో పూజలు అందుకుంటున్నాయి.
దేవీ నవరాత్రుల మహోత్సవంలో భాగంగా తొమ్మిది రోజులు అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. అమావాస్య(Amavasya) రోజున మొదలైన పూజలు 9వ రోజు దసరా పండుగ విజయదశమితో ముగుస్తోంది.
తొలి రోజూ కంటిలో చుక్క
మచిలీపట్నంలో దేవీ నవరాత్రుల భాగంగా నగరంలో పలుచోట్ల శక్తి పటాలను ఏర్పాటుచేసి దసరా ఉత్సవాలను ప్రారంభిస్తారు. దీనిలో భాగంగా అమావాస్య రోజైన మొదటి రోజున అమ్మవారికి దృష్టిని కలిగిస్తారు. ఈ సందర్భంగా అమావాస్య రోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో మాంత్రికులు (అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించే పూజారులు) కాపాలిక మంత్రాలు(Guardian Mantras) చదువుతూ స్మశానంలో దిగంబరులుగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారికి దృష్టిని కలిగిస్తారు దీనిని స్థానికంగా కంటిలో చుక్కగా పిలుస్తారు.
సరస్వతీ దేవీగా..
మూలా నక్షత్రం రోజున కాళీమాతను సరస్వతి దేవిగా అలంకరిస్తారు. విద్యార్థులు చదువుల్లో రాణించాలని కోరుతూ పూజిస్తారు, చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తారు. సరస్వతి దేవి జన్మ నక్షత్రంగా మూలా నక్షత్రాన్ని(Moola Nakshatra) భక్తులు భావిస్తారు. ఇదే రోజు మచిలీపట్నంలో ఉన్నశక్తి పటాలు ధరించినవారు అమ్మవారి వేషం ధరించి వాయిద్యాలతో నగరమంతా నృత్యం చేస్తూ పర్యటిస్తారు. బందర్ లో ఉన్న అన్ని శక్తి పటాలు కోనేరు సెంటర్లో పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేసి తిరిగి దేవాలయానికి చేరతారు.
దసరాలో మహా సందడి
దసరా పండుగ సందర్భంగా కొంతమంది పేదలు పగటి వేషాలు ,దసరా వేషాలు వేస్తారు. ఇది దసరా పండగకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఓరోరి బుడ్డోడా వగలమారి బుడ్డోడా(Vagalamari Buddoda)…. నీ సోకు నా సోకు నేలపై తాటాకు అంటూ పాటలు పాడుతూ కొంతమంది చిన్నపిల్లలు ఒంటి నిండా బొట్టులు పెట్టుకొని ప్రత్యేక నృత్యం చేస్తారు. దీనికి కానుకగా కొంతమంది ఆ పిల్లలకు డబ్బులు ఇస్తారు. ఇలా పేద ప్రజలు దసరా పండుగను అందరితో కలిసి జరుపుకుంటారు. అదేవిధంగా పెద్దవారు చిన్న పిల్లలకు దసరా మామూళ్లు రూపంలో డబ్బులు ఇచ్చి పిల్లలను ప్రోత్సహిస్తారు.
జమ్మి కొట్టి ..విజయానందం.
చెడుపై మంచి విజయం సాధించడానికి ప్రతీకగా శమీ సమయతే పాపం శమీ శత్రువినాశనం అర్జున ధనుర్ధారి రామసే ప్రియా దర్శనం. పాండవులకు, కౌరవులకు యుద్ధం జరిగే సమయంలో పాండవుల వైపు న్యాయం ఉందని భావించి తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాయటం దీని అర్థం. దసరా నవరాత్రులలో చివరి రోజైన విజయదశమి(Vijayadashami) రోజు మచిలీపట్నం నగరంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
సాయంత్రం 6 గంటలకు మొదలైన పూజలు మరుసటి రోజు ఉదయం 9 గంటలతో ముగుస్తోంది. బందరు లోని అన్ని శక్తి పటాలు కోనేరు సెంటర్ వచ్చి నృత్య ప్రదర్శన చేస్తారు. దీనికి నగరంలోని అన్నిశక్తి పటాలు పోటీ పడతాయి. శక్తి పటాలను ప్రత్యేకంగా అలంకరించి కోనేరు సెంటర్ తీసుకువచ్చి నృత్యం చేయడాన్నిస్థానికంగా జెమ్మి కొట్టడం అంటారు. ఈ కార్యక్రమంతో దసరా మహోత్సవాలు ముగుస్తాయి.
ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున ఈ నవరాత్రులు ముగిసేంతవరకు పోలీసు బలగాలను నగరంలో మొహరింప చేస్తారు. చివరి రోజు విజయదశమి నాడు పోలీసులు 24 గంటలు విధుల్లో పాల్గొని కట్టుదిట్టమైన బందోబస్తును నిర్వహిస్తారు.



