ఉస్తాద్ భగత్ సింగ్ మానియా..

ఉస్తాద్ భగత్ సింగ్ మానియా..
విజయవాడలో అభిమానుల హోరు..
థియేటర్ల వద్ద హద్దుల దాటిన అభిమానుల ఉత్సాహం
పవర్ స్టార్ సినిమా కు ఘన స్వాగతం
సంబరాలు రాజకీయ నినాదాల హోరు..
అభిమానం నియంత్రణలో పోలీసులు సతమతం..
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వస్తాది భగత్ సింగ్ విడుదలతో విజయవాడ నగరంలో అభిమానుల ఉత్సాహానికి హద్దే లేదు. తెల్లవారుజామున నుంచే థియేటర్ల వద్దకు తరలివచ్చిన అభిమానులు భారీగా గుమిగూడి పండుగ వాతావరణాన్ని సృష్టించారు. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, డీజే ధ్వనులతో నగర వీధులు కళకళలాడాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పట్ల అభిమానుల అభిమానావేశం అట్టడుగునుంచి ఉప్పొంగింది. పూలదండలు వేసి, పాలాభిషేకాలు నిర్వహిస్తూ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలకు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాస్ ఎంటర్టైన్మెంట్కు చిరునామాగా నిలిచిన దర్శకుడు హరీష్ శంకర్ ముద్ర ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

పవర్ స్టార్ రేంజ్‌కు తగ్గ మాస్ సినిమా ఇదే అంటూ ప్రేక్షకులు థియేటర్ల వద్ద హర్షధ్వానాలు చేశారు. ఇదే సమయంలో, సినిమా విడుదలను అభిమానులు రాజకీయ ఉత్సాహంతో మేళవించడం గమనార్హం. ఇది కేవలం సినిమా కాదు… రాజకీయ గర్జన అంటూ నినాదాలు చేస్తూ, సీఎం… సీఎం… అంటూ పవన్ కళ్యాణ్ పేరును జపించారు. నగర వీధులన్నీ పవన్ నామస్మరణతో మారుమోగాయి. అభిమానుల రద్దీ అధికమవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. థియేటర్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి, గుంపులను చెదరగొట్టేందుకు అదనపు బలగాలను మోహరించారు. ఈ క్రమంలో హడావిడి సృష్టించిన ఓ అభిమానిను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. సినిమా విడుదలతో విజయవాడలో నెలకొన్న ఈ ఉత్సాహం, అభిమానుల అభిమానం ఎంతటి స్థాయిలో ఉందో మరోసారి స్పష్టంచేసింది.
సెల్ఫోన్లో బంధిస్తూ..
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల సందర్భంగా థియేటర్లలో అభిమానులందరూ సినిమాను సెల్ఫోన్లో బంధించడం కనిపించింది. తమ అభిమాన నటుడు కనిపిస్తున్న సమయంలో ప్రేక్షకులందరూ ధియేటర్లలో సెల్ ఫోన్లు ఆన్ చేసి సెల్‌ఫోన్ టార్చర్ తో చిత్రాలను సెల్ఫోన్లో చిత్రీకరించారు. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు ఆద్యంతం పవన్ నామస్మరణ చేస్తూ పవన్ మానియాను మరోసారి గుర్తు చేశారు.

