కల్తీ సూత్రధారి అతడే

రూ.250 కోట్లు బుక్కేశారు..

తిరుపతి లడ్డూపై సిట్​ నిర్ధారణ

సిట్​ ఉచ్చులో  సుబ్బారెడ్డి

కల్తీలో.. పశువుల కొవ్వు లేదు

( ఆంధ్రప్రభ, ఏపీ  న్యూస్​ నెట్​ వర్క్​ ప్రతినిధి )

శేషాచలంపై చిద్విలాస కలియుగ భగవానుడు ఏడుకొండల వెంకన్న స్వామికి ఐదేళ్ల పాటు కల్తీ నెయ్యి ప్రసాదం అందించారా? 2019 నుంచి 2024 వరకూ.. అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి.. రూ.250 కోట్ల విలువ చేసే కల్తీ నెయ్యిని తిరుమలో స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన లడ్ఢూ తయారీకి సరఫరా చేసిన సంగతి వెలుగులోకి వచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో.. అణువణువూ పరిశోధన జరిపిన దర్యాప్తు సంస్థ (SIT) అసలు బాగోతాన్ని గుర్తించింది. కొన్ని గంటల కిందటే ఈ అసలు కథ ప్రపంచవ్యాప్తంగా దూసుకు పోయింది.  తిరుమలలోని (Tirumala )  శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 2019  నుంచి  2024 మధ్య రూ. 250.80 కోట్ల కల్తీ నెయ్యి సరఫరా జరిగింది. కీలక ఆధారాలతో సహా  ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కనుగొంది.

కల్తీ దొంగలు దొరికినట్టే ..

హర్ష్ ఫ్రెష్ డెయిరీ ఉత్పత్తుల వ్యాపారి  భోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ , దాని అనుబంధ సంస్థలు – వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, మల్గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ , AR డెయిరీ  ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు  కల్తీ నెయ్యిని  సరఫరా చేశాయని సిట్​ గుర్తించింది.

కల్తీ ఎలా అంటే..

ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలోని భగవాన్‌ పూర్‌లోని ఒక ప్లాంట్‌లో పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ , పామోలిన్ తదితర పదార్థాలను కలిపి  కల్తీ నెయ్యిని తయారు చేశారని  SIT అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు.  తక్కువ పరిమాణంలో  నెయ్యి తో బీటా-కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్, నెయ్యి ఫ్లేవర్ తదితర  రసాయనాలను కలిపినట్లు SIT ​​కనుగొంది ఇప్పటికే  ఈ  కేసులో భోలే బాబా, డెయిరీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్ ను అరెప్టు చేశారు.

వెలుగులోకి వచ్చింది ఇలా ..

2024 సెప్టెంబర్ 18 న అమరావతిలో జరిగిన NDA సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ  “తిరుమల లడ్డూను కూడా నాసిరకం పదార్థాలతో తయారు చేశారు.  నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును ఉపయోగించారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తిరుపతి ఆలయ లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం  జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఇక  SIT దర్యాప్తులో ప్రధాన కల్తీ పదార్థం మొక్కల ఆధారిత పదార్థాలు అని తేలింది .2022లోనే కల్తీ ప్రసాదం  వెలుగులోకి వచ్చింది, అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ YV సుబ్బారెడ్డి ఈ లడ్డూ నమూనాలను పరీక్ష కోసం పంపించారు. అప్పుడే  నెయ్యి కల్తీ అయినట్లు కనుగొన్నారు.   2024 వరకు TTDకి కల్తీ నెయ్యిని సరఫరా చేయడానికి సుబ్బారెడ్డి అనుమతించారని  SIT అధికారులు గుర్తించారు.

ఇది భక్తుల విశ్వాసంపై దాడి : మంత్రి లోకేష్​ ఇది కల్తీ కాదు, హిందువుల విశ్వాసంపై దాడి అని ఏపీ మంత్రి లోకేష్​ వ్యాఖ్యానించారు. సిట్​ దర్యాప్తు వివరాలపై ఆయన స్పందించారు. నారా లోకేష్, X లో మాట్లాడుతూ, “సుప్రీం కోర్టు నియమించిన SIT నిజాన్ని బయటపెట్టింది. దోషులు పూర్తిగా  చట్టం చర్యలు  ఎదుర్కొంటారు. ఇది కల్తీ కాదు – ఇది హిందువుల విశ్వాసంపై ఉద్దేశపూర్వకంగా దాడి, మన విశ్వాసాన్ని అపవిత్రం చేయడం, భారత ఆత్మపై నేరం. పవిత్రతతో ఆటలాడినోళ్లు మూల్యం చెల్లించుకోవాలి. ఓం నమో వేంకటేశాయ.” అని వ్యాఖ్యానించారు.

Leave a Reply