ఆగని ఆకేరు అక్రమ ఇసుక రవాణా

ఆగని ఆకేరు అక్రమ ఇసుక రవాణా
- ఆదిలోనే అటకెక్కిన ప్రభుత్వ ఆన్ లైన్ ఇసుక విధానం
- అడుగంటుకపోయిన భూగర్భ జలాలు
- చివరికి నీరు అందక అగోరిస్తున్న అన్నదాత
- అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునే అధికారులే లేరా..?
నర్సింహులపేట, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో రాత్రైతే చాలు వందల సంఖ్యలో ఇసుక రవాణా ట్రాక్టర్లు రయ్.. రయ్ అని గ్రామాల్లోని ప్రజలకు నిద్రలేకుండా జేస్తున్నా సంబంధించిన అధికారులు మాత్రం ముడుపులకు అలవాటు పడిపోయి నిద్రపోతున్నారు. జయపురం, కౌసల్యదేవిపల్లి, రామన్నగూడెం, ముంగిమడుగు శివారు బొడ్డితండ ఆకేరు పరివాహక ప్రాంత రైతులు చివరి వరకు పంట పొలాలకు తడి అందక భూగర్భజలాలు అడుగంటుకు పోయి రాళ్ళు తేలి దర్శన మిస్తున్నా.. కాపాడాల్సిన సంబంధించిన అధికారులే ముడుపుల మత్తులో పడి నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తూ ఉండడంతో అక్రమ ఇసుక రవాణాను ఆడుకునే అధికారులే లేరా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఆదిలోనే అటకెక్కిన ఆన్ లైన్ ఇసుక విధానం ప్రభుత్వ ఆదాయానికి గండి

ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలనే యోచనతో మన ఇసుక వాహనం అనే పేరుతో ఆన్ లైన్ విధానంలో ఇసుక కావాలనుకునేవారు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించింది.కానీ క్షేత్ర స్థాయిలో అమలు చేయాల్సిన అధికారులే ముడుపులకు అలవాటు పడి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తూన్నారు.
భూగర్భ జలాలు అడుగంటిపోయి పంట పొలాలు ఎండుతున్నాయి
ఆకేరు పరివాహక ప్రాంత రైతులు రబీ సీజన్లో కోతకు వచ్చే సమయంలో చివరి వరకు వరికి నీరు అందక వేలాది రూపాయలు ఖర్చు చేసి పుక్లేయర్లతో పూడిక తీసి చెలిమల ద్వారా ఊరిన నీటిని పంట పొలాలకు ఉపయోగిస్తున్నారు.
గ్రామాల వారిగా అక్రమ ఇసుక వసూళ్లు
వాగు నుండి ట్రాక్టర్లు బయటికి రావడానికి ఆకేరు పరివాహక ప్రాంత రైతులు కొంత మంది ట్రాక్టర్ కు రూ.200 నుంచి 400 ఇదొక వసూలులైతే ఇంకా గ్రామంలోని కొంత మంది నాయకులు పంచాయతీల సహకారంతో పది లక్షలు,ఐదు లక్షలు టెండర్లు పెట్టి అక్రమంగా వసూలు చేస్తున్నారు.ఇది అధికారులకు తెలిసినా కూడా తలా పాపం తిలా పెరికెడు అన్నట్లు చూసి చూడనట్లుగానే వ్యవహవరిస్తున్నారు.
ప్రభుత్వ పథకాలు పూర్తి కావచ్చినా అనుమతుల పేరుతో అక్రమ రవాణా
ప్రభుత్వ పథకాలు ఇందిరమ్మ ఇండ్లు,సిసి రోడ్ల నిర్మాణాలు దాదాపు పూర్తి కావచ్చి సరిపోయేంత ఇసుక నిల్వ చేసుకున్నా కూడా అనుమతుల పేరుతో ఇసుక మాఫియా వారు పగటిపూట కూడా జిల్లా కేంద్రానికి దర్జాగా అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్నారు.వీటి వెనుక మండల స్థాయి అధికార పార్టీ నాయకులు కొంత మంది అధికారులకు కొమ్ము కాస్తు చక్రం తిప్పుతున్నారు.
అక్రమ ఇసుక రవాణాను అధికారులు నిలువరించాలి
మంద వీరన్న,నర్సింహులపేట
గ్రామాల్లో వీధుల గుండా వెళ్ళే ట్రాక్టర్ల రద్దీతో రాత్రి వేళల్లో నిద్ర లేకుండా పోతుంది.అధిక స్పీడు,దుమ్ము దూళిలతో ఇల్లు అంత మసకబారి ఆరోగ్యం క్షీణిస్తోంది.జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలి.
