Budget| 9వ సారి ప్ర‌వేశ‌పెట్టిన నిర్మ‌ల‌మ్మ

9వ సారి ప్ర‌వేశ‌పెట్టిన నిర్మ‌ల‌మ్మ

వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ఉదయం పార్లమెంట్​లో కేంద్ర బడ్జెట్ 2026–27ను ప్రవేశపెట్టారు. వరుసగా 9వ సారి కేంద్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రణబ్ ముఖర్జీ రికార్డును ఆమె అధిగమించారు. ఇలా వరుసగా 9 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక మహిళా ఆర్థిక మంత్రిగా కూడా ఆమె రికార్డు క్రియేట్ చేశారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆదివారం (ఫిబ్రవరి 01) రోజున బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా కొత్త ఒరవడికి కూడా నిర్మల శ్రీకారం చుట్టారు.

ఆదివారం ఉదయం 11గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌ను లోక్‌స‌భకు సమర్పించారు. బడ్జెట్‌కు ముందు తన బృందంతో కలిసి నిర్మలాసీతారామన్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని ద్రౌపదీ ముర్మును కలిశారు. రాష్ట్రపతికి బడ్జెట్ పత్రాలు అందజేశారు. అనంతరం బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో.. ఉదయం 11 గంటలకు మంత్రి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “పవిత్ర మాఘపౌర్ణిమ రోజున బడ్జెట్ తీసుకువస్తున్నాం. కర్తవ్య భవన్‌లో రూపొందించిన మూడో బడ్జెట్ ఇది. యువశక్తి కేంద్రంగా దీనిని ప్రవేశపెడుతున్నాం. భారత దేశ ఆర్థిక ప్రయాణం స్థిరంగా సాగుతోంది. ప్రపంచ మార్కెట్లతో భారత్‌ను అనుసంధానిస్తున్నాం. ప్రజల ఆకాంక్షలను ఆచరణలో తీసుకొస్తున్నాం. నైపుణ్యం, పోటీతత్వం, ఉత్పాదకతతో భారత్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్తాం. రైతులు, దళిత, గిరిజన సమూహాలకు అభివృద్ధి ఫలాలు చేరాల‌ని ఆమె తెలిపారు.

Leave a Reply