రూ.35లక్షల బంగారం, నకిలీ నోట్లు స్వాధీనం
- అనంతపురం ఎస్పీ జగదీష్
(అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ) : నకిలీ నోట్ల తయారీ, చెలామణీ చేస్తున్న ఇద్దరు అంతరాష్ట్ర చైన్ స్నాచర్లను పుట్లూరు పోలీసులు, సీసీఎస్ సిబ్బంది కలిసి పట్టుకున్నారు. తాజాగా 12 కేసులు ఛేదించారు. రూ. 35 లక్షల 304 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 35,500 వేల నగదు, నకిలీ 500 నోట్లు ప్రింటర్, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం అనంతపురం పోలీస్ కాన్ఫరెన్స్ హాలు (Anantapur Police Conference Hall) లో నిర్వహించిన మీడియా సమావేశంలో అనంతపురం జిల్లా ఎస్పీ పి.జగదీష్ (SP P. Jagadish) ఈ కేసుల వివరాలను తెలిపారు. అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రం, పాత ఎస్.సి కాలనీకి చెందిన ఎం.జశ్వంత్ అలియాస్ జస్వంత్ అలియాస్ రాజు అలియాస్ గుండు (25), కంబదూరు మండల కేంద్రం చెక్ పోస్ట్ సమీపంలోని ఆర్డీటీ కాలనీకి చెందిన కంబదూరు భోగం రాజు అలియాస్ షాలేము రాజు అలియాస్ షాలెమ్ (21) మంచి స్నేహితులు. క్రికెట్ బెట్టింగ్, పేకాట, తదితర వ్యసనాలకు ఆలవాటుపడి అప్పులు చేశారు. ఈ అప్పులు తీర్చడానికి, వ్యసనాలకు సులువుగా డబ్బులు సంపాదించాలని భావించారు. చైన్ స్నాచింగులు నకిలీ నోట్ల తయారీ, చలామణి కి వ్యూహరచన చేసుకున్నారు.
చైన్ స్నాచింగుల్లో దిట్టలు
ఈ ఇద్దరు జంటగా శివారు ప్రాంతాలు, జన సంచారం లేని ప్రదేశాలలో మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగుల (Chain snatching) కు పాల్పడ్డారు. ఈ ఇద్దరు ద్విచక్ర వాహనంపై వెళ్లి అనంతపురం, పుట్లూరు, నార్పల, ఉరవకొండ, తాడిపత్రి పట్టణం చుట్టుప్రక్కల గ్రామాలు, కడప జిల్లా సింహాద్రిపురం మండలం తదితర ప్రాంతాల్లో చైన్ స్నాచింగులకు పాల్పడ్డారు. గత రెండేళ్లలో వీరిద్దరూ 12 చైన్ స్నాచింగులకు పాల్పడ్డారు. అనంతపురం నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ -1, నార్పల-2, ఉరవకొండ-1, తాడిపత్రి-3, తాడిపత్రి రూరల్ – 1, అనంతపురం రూరల్ – 1, పుట్లూరు-2, కడప జిల్లా సింహాద్రిపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఒకటి … మొత్తం 12 చైన్ స్నాచింగులు చేయగా ఈ మొత్తం కేసుల్లో పోలీసులు రికవరీ చూపారు
దొంగనోట్ల తయారీ.. చెలామణి
దొంగనోట్ల తయారీ (Making counterfeit notes) చేసి చెలామణి చేసేందుకు పన్నాగం పన్నారు. కలర్ ప్రింటర్ ద్వారా నకిలీ నోట్లు తయారీలో నిమగ్నమయ్యారు. లాంగ్ నోట్ బుక్ లలోని వైట్ పేపర్లు తీసుకుని వాటిల్లో ఒరిజినల్ కరెన్సీ నోట్లను జిరాక్స్ చేసి చెలామణి చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దొంగనోట్ల తయారీ చెలామణి గుట్టు ఆదిలోని రట్టయ్యింది.
జశ్వంత్ పై ఆరు కేసులు:
జశ్వంత్ (Jaswant) పాతనేరస్థుడు. ఇతనిపై ఇదివరకే ఆరు కేసులు ఉన్నాయి. గత నాలుగేళ్లుగా కర్నాటక రాష్ట్రం పావగడ, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, కంబదూరు ప్రాంతాలలో వాహనాల చోరీ, ఇంట్లో దొంగతనాలు, దోపిడీ. చైన్ స్నాచింగ్ లు చేశాడు. 2021లో కర్నాటక రాష్ట్రం పావగడలో -2 , వైఎన్ హొసకోటలో ఒకటి, 2023 లో జిల్లాలోని కళ్యాణదుర్గంలో ఒకటి… 2024 లో కంబదూరు పోలీసు స్టేషన్లో 2 కేసులు ఇతనిపై నమోదయ్యాయి.
దొరికారు .. ఇలా
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో చైన్ స్నాచర్లపై పోలీసులు (Police) ప్రత్యేక నిఘా వేశారు. పుట్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.సత్యబాబు, అనంతపురం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (C.C.S) ఇన్స్పెక్టర్లు శేషగిరి, జయపాల్ రెడ్డి, వలి బాషు, SI రాజశేఖర్ రెడ్డి, CCS సిబ్బంది హెడ్ కానిస్టేబుళ్లు మల్లికార్జున, చంద్ర శేఖర్, తిరుమలేశు, శ్రీధర్ ఫణి, వెంగప్ప, మక్భుల్, కిరణ్, రఘునాథ రెడ్డి, వేణుగోపాల్, భాస్కర్, మధు కానిస్టేబుల్స్ రంజిత్ కుమార్, బాలకృష్ణ, జయరామ్, ఆసిఫ్, దాస్ పుట్లూరు పోలీసు స్టేషన్ సిబ్బంది ASI. టీఎస్ .అనీష్ బాష, హెడ్ కానిస్టేబుల్స్ నూరుళ్ళ, అబ్దుల్ రహిమాన్ , పోలీసు కానిస్టేబుల్స్ రమేశ్, నరేశ్ కుమార్, శివశంకర్, అల్థాఫ్ లు ప్రత్యేక బృందంగా ఏర్పడ్డారు. పుట్లూరు మండలం శెనగల గూడూరు గ్రామ సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద వీరిద్దరినీ పట్టుకున్నారు. ఈ పోలీసు బృందాలకు రివార్డ్ లు ఇచ్చి జిల్లా ఎస్పీ పి. జగదీష్ అభినందించారు.


