ఒకడి కోసం ఇద్దరు..
ఒంగోలు క్రైం, ఆంధ్రప్రభ : అతడు ఆటోడ్రైవర్. గంజాయి ధీరుడు. జైలుకు వెళ్లి వచ్చాడు.
ఇతడి కోసం ఇద్దరు ప్రియురాళ్ల మధ్య రగిలిన చిచ్చులో.. ఒక ప్రియురాలు.. మరో ప్రియురాలిని కిడ్నాప్ చేసి.. వస్త్రాపహరణం చేసి.. వీడియోలో చిత్రీకరించింది. ఒక కృష్ణుడు, ఇద్దరు రాధల రగడ.. పోలీసు స్టేషన్ వరకూ వెళ్లింది.
ఓ మహిళను కిడ్నాప్ చేసి గదిలో బంధించి వివస్త్రను చేసిన మరో మహిళపై ఒంగోలు టూటౌన్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఒంగోలు రెండో పట్టణ సీఐ ఎం.శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చంద్రయ్య నగర్ కు చెందిన ముప్పర్తి లక్ష్మీ రాంనగర్ ఒకటో లైన్ లోని ద్వారక క్యాటరింగ్ లో పని చేస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తకు దూరంగా ఉంటూ తన ఇద్దరు పిల్లలను పోషించుకుంటోది. ఒంగోలులోని ఆటో డ్రైవర్ సుభానితో పరిచయం ఏర్పడింది. సహజీవనం చేస్తోంది. తమ ఇద్దరి సహజీవనం వివాహబంధంగా మారుతోందని ఇన్ స్టా గ్రామ్ ద్వారా ఇటీవల షేర్ చేసింది. ఈ ఇన్ స్టా గ్రామ్ సందేశంతో మరో ప్రియురాలు తెరమీదకు వచ్చింది. కబాడీ పాలేనికి చెందిన చెన్నూరి పూజిత ఈ సందేశాన్ని చూసి జీర్ణించుకోలేక పోయింది. లక్ష్మీపై దాడి చేసేందుకు ప్లాన్ రెడీ చేసింది. క్యాటరింగ్ లో పని చేసే స్నేహితులు కట్ట బిందు, వినయ్, నాని, చక్రిల సహాయం కోరింది. శనివారం లక్ష్మి స్థానిక కర్నూల్ రోడ్ లోని అన్నా క్యాంటీన్ సమీపంలో ఉన్నట్టు సమాచారాన్ని తెలుసుకొని తన మిత్రులతో అక్కడికి పూజిత చేరుకుంది. లక్ష్మిని కిడ్నాప్ చేసి ఆటోలో స్థానిక రంగు తోటలోని గదికి తరలించింది. లక్ష్మీపై దాడికి పాల్పడింది. అర్థనగ్నంగా ఉన్న ఆమెపై దాడి చేస్తూ వీడియోలను చిత్రీకరించింది. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న నేపథ్యంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తును చేపట్టారు. వీరిద్దరితో అక్రమ సంబంధం ఏర్పరచుకున్న సుభాని అనే యువకుడి పై పలు స్టేషన్లలో కేసులు నమోదు అయినట్లు గంజాయి కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.

