గుండాల, మే 5 (ఆంధ్రప్రభ) : గుండాల ఎస్సై రవూఫ్ తమ సిబ్బందితో కలిసి ఇద్దరు నకిలీ నక్సలైట్లను అరెస్ట్ చేశారు. ఈరోజు పెట్రోలింగ్ కు వెళుతుండగా తురుబాక గ్రామం నందు రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకొని విచారించారు. వారిలో ఒకరు ఆళ్లపల్లి మండలం నడిమిగూడెంకు చెందిన పాయం రాజేందర్, మరొకరు గుండాల మండలం ఘణపురంకు చెందిన కల్తీ పాపయ్య గా గుర్తించినట్లు ఇల్లందు డీఎస్పీ చంద్రభాను తెలిపారు.
ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ… ఈ ఇద్దరు గతంలో ప్రజా ప్రతిఘటన దళంలో పనిచేశారన్నారు. కల్తీ పాపయ్య 2010 సంవత్సరంలో హత్యా ప్రయత్నం కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లి వచ్చాడన్నారు. పాయం రాజేందర్ గతంలో ప్రజా ప్రతిఘటన దళంలో పనిచేసి ఆళ్లపల్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడన్నారు. వీరిద్దరూ జల్సాలకు అలవాటుపడి ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఉదేశ్యంతో మావోయిస్టు పార్టీ పేరు చెప్పి గుండాల, ఆళ్లపల్లి మండలాల వ్యాపారస్తులకు గత రెండు, మూడు నెలల నుండి ఫోన్లు చేసి పార్టీ ఫండ్ కోసం డబ్బులు కావాలని బెదిరిస్తున్నారన్నారు.
ఈ రోజు వీరిద్దరిని అరెస్ట్ చేసి, వీరిరువురి నుండి రూ.5వేలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొన్నారన్నారు. నిషేధిత మావోయిస్టులది కాలం చెల్లిన సిద్దాంతాలని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు ఉనికి అనేది లేదని డీఎస్పీ చంద్రభాను తెలిపారు. ఎవరైనా మావోయిస్టుల పేరుతో ఫోన్లు చేసి బెదిరిస్తే ప్రజలు ఎటువంటి భయబ్రాంతులకు గురికాకుండా పోలీసులకు ఫిర్యాదు చేయవలసిందిగా కోరారు. వీరిని పట్టుకోవడంలో కృషిచేసిన గుండాల సి.ఐ. లోడిగ రవీందర్, ఎస్.ఐ.సైదా రావూఫ్, పి.సి.వెంకటేశ్వర్లును డీఎస్పీ చంద్రభాను అభినందించారు.