పెళ్లికి రెండు రోజుల ముందు…

ఎడపల్లి, (ఆంధ్రప్రభ): ఎడపల్లి మండలం మంగళపాడు గ్రామంలో పెళ్లి వేడుకకు సిద్ధమైన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రతాప్ గౌడ్ (31) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గత రెండు రోజులుగా కనిపించకుండా ఉన్న ప్రతాప్ గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకుని మృతిచెందినట్లు స్థానికులు గుర్తించారు. అతని పెళ్లి గురువారం జరగాల్సి ఉండగా, ఆత్మహత్య వార్తతో గ్రామం అంతా విషాదంలో మునిగిపోయింది.
ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని బోధన్ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
