అందుకే ఈ ప్రమాదాన్ని రాజకీయం చేస్తున్నారు
మీడియాతో మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి
అమ్రాబాద్, ఆంధ్రప్రభ : ఎస్ ఎల్ బీసీ దుర్ఘటనలో సహాయచర్యలను పర్యవేక్షించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట ప్రమాద స్థలి దోమలపెంటకు సోమవారం ఉదయం చేరుకున్నారు. వీరితోపాటు మాజీ మంత్రి జానారెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే తదితరులు కూడా చేరుకున్నారు. సహాయ చర్యలు జరుగుతున్న తీరుపై అధికారులతో చర్చించారు. అనంతరం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలకు మానవత్వం లేదని.. ఎస్ఎల్‌బీసీ ప్రమాదాన్ని రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు నిరంతరం అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. తూప్రాన్ రైలు ప్రమాదంలో స్కూల్ విద్యార్థులు చనిపోతే కేసీఆర్ కనీసం వెళ్లి పరమర్శించలేదని విమర్శించారు. “ మీరు చేయని పనులు మేము చేస్తున్నాం” అని.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అందరం కలిసికట్టుగా ఉండాలన్నారు. ఆపదలో ఉన్నవారికి మనోధైర్యం ఇవ్వాలని, సురక్షితంగా తీసుకురావడానికి సలహాలు ఇవ్వాలన్నారు. ఇది రాజకీయాలు మాట్లాడే సమయం కాదని.. అందరినీ బయటకు తెచ్చిన తర్వాత మళ్లీ పనులు మొదలు పెడతామని.. ఆ తర్వాత బీఆర్ఎస్ వాళ్ల సంగతి చెబుతామన్నారు.
ఇది బీఆర్ఎస్ నిర్లక్ష్యం
గత ప్రభుత్వం (బీఆర్ఎస్) ఎస్ఎల్‌బీసీని నిర్లక్ష్యం చేసిందని, మేము దాన్ని పూర్తి చేయాలని భావిస్తే ఇలాంటి ప్రమాదం జరగడం బాధాకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అందులో చిక్కుకున్న 8 మంది క్షేమంగా బయటకు రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. సొరంగం గురించి, ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు లేదన్నారు. పదేళ్లు సొరంగాన్ని ఎందుకు పట్టించుకోలేదో చెప్పాలని.. కాళేశ్వరంలో చిన్న చిన్న సొరంగం పనులకు ఎంతో మంది చనిపోయారని, కాళేశ్వరంలో చనిపోతే బీఆర్ఎస్ నేతలు ఏమైనా సహాయ చర్యలు చేపట్టారా? అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు.