Tunnel Collapse | ఎవ్వరూ బతకలే! మ‌ట్టిలో కూరుకుపోయారు

మృతదేహాల గుర్తింపులో యంత్రాంగం బిజీ
కాంక్రిట్ కింద మూడు మృతదేహాలు
ప్రమాదస్థలిలో ఉస్మానియా డాక్ట‌ర్లు
డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాల అప్పగింత
సహాయక చర్యల్లో పాల్గొన్న 250 మంది సిబ్బంది
ప‌రిహారం ప్ర‌క‌టించ‌నున్న ప్ర‌భుత్వం

అమ్రాబాద్‌ / అచ్చంపేట‌, ఆంధ్రప్రభ : ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో గల్లంతైన ఎనిమిది మంది ఇక లేరు. ఎనిమిది రోజులుగా ప్రతి ఒక్కరూ ఊహించిందే నిజమైంది. బురదలో కూరుకుపోయిన బాధితులు ప్రాణాలతో బయటకు రారని.. కానీ అప్పటికి దింపుడు కళ్లెం ఆశ.. పెను ప్రమాద హెచ్చరికనూ బేఖాతరు చేసిన సహాయక బృందాలు.. ఇప్పుడు ఆ మృతదేహాలను బయటకు తీసేందుకు శ్రమిస్తున్నాయి. 250 మంది నాలుగు బృందాలుగా విడిపోయి శుక్ర‌వారం రాత్రి నుంచి మృతదేహాల వెలికితీతలో నిమగ్నమయ్యారు.

మృతదేహాల గుర్తింపు కోసం..

రాడార్ రిపోర్ట్ ఆధారంగా అయిదు మృతదేహాలున్న ప్రాంతాలను సహాయక బృందాలు శుక్రవారం గుర్తించాయి. టీబీఎం సమీపంలో సిమ్మెంటు కాంక్రీట్ కింద మూడు మృతదేహాల అనవాళ్లను గుర్తించారు. డీఎన్ఏ పరీక్షలతో దీంతో మృతదేహాలను గుర్తించేందుకు శనివారం ఉదయం శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్టన్నెల్ దగ్గరకు ఉస్మానియా ఫోరెన్సిక్ డాక్ట‌ర్లు చేరుకున్నారు. ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ శ్రీధర్ సహా ఇద్దరు ఫ్యాకల్టీ, ఇద్దరు పీజీ వైద్యులు ప్రమాద స్థలికి చేరుకున్నారు. మరోవైపు మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు చేరుకున్నారు.

మృతులు వీరే..

ఎస్ఎల్బీసీ సొరంగంలో జేపీ సంస్థకు చెందిన మనోజ్ కుమార్ (ప్రాజెక్ట్ ఇంజనీర్), శ్రీనివాస్ (సైట్ ఇంజనీర్ ), రాబిన్సన్ సంస్థకు చెందిన టీబీఎం ఆపరేటర్లు సన్నీ సింగ్ (35), గురు దీప్ సింగ్ (40), రోజువారీ కార్మికులు సందీప్ సాహు (28), జక్తాజెస్ (37), సంతోష్ సాహు (37), అనూజ్ సాహు (25) ఉన్నారు. వీరందరూ జమ్మూ, పంజాబ్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చారు. ఈ మృతదేహాలను గుర్తించి అధికారులు బంధువులకు అప్పగించనున్నారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వమే ఆ మృతదేహాలను సొంతూళ్లు పంపిస్తుంది. ఇక ప్రమాద స్థలం వరకు జైపీ కంపెనీ లోకో ట్రాక్‌ను సిద్ధం చేసింది. 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల ఎత్తులో బురద, మట్టి, రాళ్లు ఉన్నాయి. ఇక్కడే టీబీఎం సగ భాగం కూరుకుపోయింది. మట్టిని బయటకు తరలించేందుకు మ్యానువల్‌గా సాధ్యం కాకపోవడంతో లోకోను అక్కడి వరకు తెచ్చే ప్రయత్నం చేస్తు్న్నారు.

అందుబాటులోకి క‌న్వేయ‌ర్ బెల్టు..

కన్వేయర్ బెల్టు కూడా అందుబాటులోకి వచ్చింది. 12వ కిలోమీటర్ నుంచి 13.5 కిలోమీటర్ల వరకు పేరుకుపోయిన మీటరున్నర మట్టిని రెస్క్యూ టీమ్స్ ఎత్తి పోస్తున్నాయి. లోకోను 13.5 కిలోమీటరు వరకు తీసుకొచ్చి మట్టిని బయటకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు రైల్వే, సింగరేణి సిబ్బంది ప్లాస్మా కటింగ్ తో టీబీఎం ను తొలగిస్తున్నారు. ఇప్పటికే ఉస్మానియా వైద్యులు శవ పరీక్షల్లో నిమగ్నమయ్యారు. శనివారం సాయంత్రంలోగా మృతుల పూర్తి సమాచారం వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఎస్ ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ, తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ చేరుకున్నారు. సహాయకచర్యల్లో పాల్గొన్న 12 ఏజెన్సీలతో సమీక్ష జరిపారు. దాదాపు 8 మంది మృతి చెందినట్టు ఒక నిర్ణారణకు వచ్చారు. సొరంగం నుంచి మృతదేహాలను వెలికి తీసిన తరువాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అప్పటికే స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ, సొరంగంలోని చిక్కుకున్న కార్మికులందరూ మృతి చెందినట్టు మీడియాకు చెప్పారు. మృతదేహాలను వెలికి తీసి బంధువులకు అప్పగిస్తామని స్పష్టం చేశారు.

మృతుల కుటుంబాలకు పరిహారం

సొరంగం పనులు ప్రారంభించిన జేపీ కంపెనీ ఇన్ప్యూరెన్స్ చేసింది. ఈ స్థితిలో అన్ స్కిల్డ్ వర్కర్లకు రూ.50లక్షలు, టెక్నికల్ సిబ్బందికి రూ.కోటి పరిహారం లభించే అవకాశం ఉన్పట్టు ఎమ్మెల్యే వంశీకృష్ఱ వివరించారు. జేపీ కంపెనీ కూడా ఆర్థికంగా ఆదుకునే అవకాశం ఉందన్నారు. ఇక రాష్ర్త ప్రభుత్వం కూడా తన వంతు ఆర్థిక సాయం చేస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఇక్కడి పరిస్థితిని సమీక్షించారని, తక్షలణ సాయానికి ఆదేశాలు జారీ చేశారని ఎమ్మెల్యే వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *