రైల్వేలో మొబైల్ టికెటింగ్
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: రైలు ప్రయాణీకులకు శుభవార్త. రైల్వే శాఖ మొబైల్ టికెటింగ్ సేవలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా సాధారణ బోగీలలో ప్రయాణించే వారికి స్టేషన్ కౌంటర్ల వద్ద ఉండే రద్దీ నుంచి ఉపశమనం లభించనుంది. ఈ కొత్త విధానం ద్వారా, ప్రయాణికులు ఇకపై క్యూలలో నిలబడాల్సిన అవసరం ఉండదు.
రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఈ విధానం ఇప్పటికే ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా, టీటీఈలు, టికెట్ తనిఖీ బృందాలు చేతిలో ఇమిడే ప్రత్యేకమైన మొబైల్ పరికరాలను ఉపయోగించి ప్రయాణికులకు నేరుగా టికెట్లను జారీ చేస్తారు. ఈ పరికరంలో ప్రయాణికుల వివరాలు, గమ్యస్థానం వంటి సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత, దానితో అనుసంధానించబడిన ప్రింటర్ల ద్వారా వెంటనే టికెట్లు జారీ అవుతాయి.
ఈ కొత్త సేవతో ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది, రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన స్టేషన్లలో ఈ మొబైల్ టికెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని రైల్వే అధికారులు యోచిస్తున్నారు. ఈ మార్పు సాధారణ ప్రయాణికులకు రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది.