TTD | తిరుమలేశుని కానుకల లెక్కింపులో ఏఐ వినియోగం

TTD | తిరుమలేశుని కానుకల లెక్కింపులో ఏఐ వినియోగం

  • టిటిడికి హైకోర్టు సూచన 

TTD | తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : తిరుమలేశుని కానుకలను లెక్కించే పరకామణి కేంద్రంలో అత్యాధునిక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ ) పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంపై దృష్టిని సారించాలని తిరుమల తిరుపతి (Tirupathi) దేవస్థానాల (టిటిడి)ని రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. తిరుమల పరకామణి చోరీకి సంబంధించి శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి తిరుమలలో ఏం జరిగినా కోట్లాదిమంది భక్తుల మనోభావాలపై ప్రభావం ఉంటుందనే విషయాన్ని ప్రత్యేకంగా పేర్కొంటూ హుండీ కానుకల లెక్కింపు విధానాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. హుండీలో భక్తులు సమర్పించే ప్రతి పైసా లెక్క సరిగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే గత వాయిదా సందర్భంగా తాము చేసిన సూచనల మేరకు పరకామణి నిర్వహణకు సంబంధించి ఏదైనా సూచనలు, సలహాలు ఇస్తారా అని న్యాయమూర్తి టిటిడి న్యాయవాదులను అడిగారు.

TTD

తిరుమల హుండీ కానుకల లెక్కింపులో అనుసరించే విధానాలను వివరిస్తూ లెక్కింపులో డబ్బులే కాకుండా హుండీలో వేసే పూలు, వివిధ వస్తువులు, ముడుపుల మూటలు వంటి వాటిని వేరు చేయడానికి నేలపైనే కూర్చుని లెక్కింపు చేస్తారని న్యాయవాదులు తెలియచేసారు. అయితే నాణాలను, నోట్లను విడివిడిగా లెక్కకట్టే అత్యాధునిక యంత్ర సామాగ్రి కూడా అందుబాటులో ఉండే విషయాన్ని ప్రస్తావించిన న్యాయమూర్తి ఏఐ సాంకేతికతను వినియోగించి మానవ రహితంగా హుండీ కానుకలను లెక్కించే విధానాలను అమలు చేసి విషయంపై టి టి డి బోర్డు (TTD Board) దృష్టి సారించాలని సూచించారు.

ఇందుకు అవసరమైన తక్షణ ప్రణాళికలకు రూపొందించుకునే అంశాలతో మరో రెండు వారాల్లో నివేదికను సమర్పించాలని కూడా న్యాయమూర్తి టిటిడికి (TTD) నిర్దేశించారు. శాశ్వత సంస్కరణల్లో భాగంగా కానుకలను వర్గీకరించడం విదేశీ కరెన్సీని గుర్తించడంలో ఏఐ సాంకేతికతని వినియోగించడం, విలువైన లోహాలను వేరు చేసే వ్యవస్థను రూపొందించడం వంటి అంశాలతో ప్లాన్ బి ముసాయిదాను రూపొందించి ఎనిమిది వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని కూడా న్యాయమూర్తి టిటిడిని ఆదేశించారు. పరకామణి కేసుకు సంబంధించి నిందితుడు సివి రవికుమార్ (CV Ravikumar) ఆస్తుల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు మొదలైన లావాదేవీలకు సంబంధించి సమగ్ర వివరాలను వారంలోగా కోర్టు ముందు ఉంచాలని ఏసీబీని న్యాయమూర్తి ఆదేశించారు. కేసు తదుపరి విచారణను ఈనెల 26వ తేదికి వాయిదా వేశారు.

Leave a Reply