భగత్ సింగ్ ఆశయాలను నేటి యువత అనుసరించాలి…

భగత్ సింగ్ ఆశయాలను నేటి యువత అనుసరించాలి…
సమ సమాజ నిర్మాణం, శాస్త్రీయ విజ్ఞానం సాధించడానికి యువతరం ముందుకు సాగాలి..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : దేశానికి స్వాతంత్రం రావటంలో భగత్ సింగ్ తోడ్పాటు ఎంతో ఉందని నేటి యువత ఆయన ఆశయాల కనుగుణంగా పనిచేయాలని వక్తలు అభిప్రాయపడ్డారు.భగత్ సింగ్ 95వ వర్ధంతి కార్యక్రమం సోమవారం భగత్ సింగ్ గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. అమరవీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ దేవ్ గార్లకు జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి , డాక్టర్ క్రాంతి చైతన్య మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ న్యాయవాది శంకరయ్య అధ్యక్షత వహించారు. వారు మాట్లాడుతూ భగత్ సింగ్ చాలా చిన్న వయసులోనే అనేక గ్రంథాలను చదివారని, సమాజాన్ని అధ్యయనం చేశారని, భారతదేశానికి స్వాతంత్రం రావడంతో పాటు దోపిడీ విధానం నశించాలని, యువతరం శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలని పేర్కొన్నారు.

కుల వ్యవస్థను భగ్నం చేస్తే తప్ప విప్లవం విజయవంతం కాదని ఆయన చెప్పారు. భగత్ సింగ్ ఆవేశంతో జాతీయ ఉద్యమం నడపలేదని, ఆలోచనలతో విప్లవ సాధనకు పూనుకొన్నాడని పేర్కొన్నారు. భగత్ సింగ్ ఏ రోజు హింసను ప్రేరేపించలేదన్నారు. పార్లమెంటుపై పొగ బాంబులు విసిరి స్వచ్ఛందంగా పట్టు పడ్డారని, తమ ఆలోచనలను ప్రజల ముందు తీసుకపోవటానికి దీనిని ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నాడు అని అన్నారు.
భగత్ సింగ్ తండ్రి తన కుమారుడి పై ఉన్న ప్రేమతో బ్రిటిష్ వారికి క్షమాభిక్ష పెట్టమని ఆడుగగా భగత్ సింగ్ దానిని వ్యతిరేకిస్తూ తన మరణం కోట్లాది ప్రజలకు స్ఫూర్తిని ఇస్తుందని, ఉరితాడు ముద్దాడి విప్లవం వర్ధిల్లాలి అని నినాదాలతో మరణించారని అన్నారు. భగత్ సింగ్ ఆశించిన ఆశయాలు ఇంకా నెరవేరలేదని ప్రస్తుత సమాజంలో ఉన్న మతతత్వం, మూఢనమ్మకాలు, దోపిడీ విధానం, రాజ్యాధికారుల అప్రజాస్వామిక పరిపాలన అంతమొందించడానికి భగత్ సింగ్ మళ్లీ పుట్టాలని అన్నారు.
నేడు దేశంలో ఎన్నికల కమిషన్ పై అనేక ఆరోపణలు వస్తున్నాయని, ఎన్నికల అధికారుల నియామకమే పట్టా విరుద్ధంగా ఉన్నదని, ఎన్నికల అధికారి పాలకుల కొమ్ముకాస్తున్నారని ఇది రాజ్యాంగాన్నీ విరుద్ధంగా ఉన్నదని, 25 లక్షల కోట్లు అప్పు చెల్లించకుండా ధనవంతులు విలాసవంతంగా జీవిస్తున్నారని, వారిపై కేంద్ర ప్రభుత్వము చర్యలు ఏమీ తీసుకోలేదని, సాధారణ ప్రజలపై మాత్రము ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ఈ విధానాలు మారాలంటే యువతరం నిరంతర అధ్యయనంతో భగత్ సింగ్ ఆశయాలను నెరవేర్చడానికి ప్రతిన పునాలని కోరారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డు నెంబరు న్యాయవాది శ్రీనివాసులు, డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ భగత్ సింగ్ ఆశయాలను నెరవేర్చడానికి భగత్ సింగ్ జాతీయ జన చైతన్య విజ్ఞాన కేంద్రం పనిచేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రజలు విరివిగా పాల్గొన్నారు.
