అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అంతర్జాతీయ వాణిజ్య విధానాలపై తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా సుంకాల విషయంలో ఆయన అనుసరించిన వైఖరి అనేక దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
భారత-అమెరికా వాణిజ్య ఒప్పందాలపై తక్కువ సుంకాలు (20 శాతం లోపు) ఉండొచ్చని గతంలో ట్రంప్ సంకేతాలు ఇచ్చినా, ఆ అంచనాలను తారుమారు చేస్తూ భారత్‌తో సహా కొన్ని దేశాలపై అధిక సుంకాలను విధించారు. ఈ విధానం ఆగస్టు 1, 2025 నుండి అమల్లోకి రానుంది. రష్యాపై కూడా వాణిజ్య జరిమానాలు విధించబడతాయని ఆయన ప్రకటించారు.
అత్యధిక సుంకాలతో ప్రభావితమైన దేశాలు
ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ప్రవేశపెట్టిన టారిఫ్ విధానాల్లో కొన్ని దేశాలు అత్యధికంగా ప్రభావితమయ్యాయి. బ్రెజిల్ దిగుమతులపై ఏకంగా 50 శాతం సుంకం విధించచారు, ఇదే అత్యధికం.
ఇతర దేశాలపై విధించిన సుంకాలు ఈ విధంగా ఉన్నాయి:
40 శాతం: మయన్మార్, లావోస్
36 శాతం: కంబోడియా, థాయ్‌లాండ్
35 శాతం: బంగ్లాదేశ్, సెర్బియా, కెనడా
30 శాతం: మెక్సికో, దక్షిణాఫ్రికా, బోస్నియా అండ్ హెర్జెగోవినా, శ్రీలంక, అల్జీరియా, ఇరాక్, లిబియా, చైనా
భారత్‌తో పాటు మరో మూడు దేశాలపై 25 శాతం సుంకాలు విధించారు. ఇది భారతీయ దిగుమతిదారులకు గణనీయమైన ఆర్థిక భారాన్ని కలిగించనుంది.
25 శాతం: భారత్, బ్రూనై, మలేషియా, దక్షిణ కొరియా, కజకిస్తాన్, మోల్డోవా, ట్యునీషియా.
20 శాతం: వియత్నాం
19 శాతం: ఇండోనేషియా, ఫిలిప్పీన్స్
15 శాతం: జపాన్, యూరోపియన్ యూనియన్
అంచనాలు తారుమారు: భారత్‌పై ప్రభావం
గతంలో అధ్యక్షుడు ట్రంప్, వాణిజ్య భాగస్వాములకు 15 నుండి 20 శాతం మధ్య టారిఫ్ విధిస్తామని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు భారత్‌పై 25 శాతం సుంకం విధించడంతో, ఈ అంచనాలు తారుమారు అయ్యాయి. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు.