- భారత్‌పై 25% దిగుమతి సుంకం
- భారత్ రష్యాతో వాణిజ్యమే ప్రధాన కారణం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సంచలనాత్మక ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించిన ట్రంప్, తాజాగా భారత్ పై కీలకమైన 25 శాతం దిగుమతి సుంకాన్ని ప్రకటించారు. ఇప్పటికే చైనా, యూరప్ దేశాలపై అధిక దిగుమతి సుంకాలను విధించిన ట్రంప్, భారత్‌ను కూడా ఆ జాబితాలో చేర్చారు. ఈ విధానం ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది.
భారత్ మిత్ర దేశమే కానీ..
ట్రంప్ తన అధికారిక ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో పోస్ట్ చేస్తూ, “భారతదేశం మిత్రదేశం అయినప్పటికీ, అమెరికాతో వారి వాణిజ్యం చాలా అసమతుల్యంగా ఉంది. భారత ప్రభుత్వం విదేశీ ఉత్పత్తులపై అత్యధిక సుంకాలు విధిస్తూనే కాదు, ద్రవ్యేతరంగా కూడా అనేక కఠినమైన అడ్డంకులను అమలు చేస్తోంది” అని విమర్శించారు.
“రష్యా ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో, భారతదేశం ఇప్పటికీ రష్యా నుండి పెద్ద మొత్తంలో రక్షణ పరికరాలను కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న దాడులను ఆపాలని ప్రపంచం ఆశిస్తున్న తరుణంలోనూ, భారత్ చైనా సరసన నిలిచి రష్యా ఉత్పత్తులకు అతిపెద్ద కొనుగోలుదారులలో ఒకటిగా మారింది.” అని ట్రంప్ అన్నారు.