- జీ7 దేశాల సమావేశాల నుంచి నిష్కృమణ
- ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో ట్రంప్ సమావేశం
- అమెరికా సైనిక కమాండర్లతో నేడు ట్రంప్ కీలక సమావేశం
వాషింగ్టన్ డిసి : ఇజ్రాయెల్-ఇరాన్ (Israel-Iran) మధ్య పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఇరు పక్షాలు భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక కెనడాలో జీ7 శిఖరాగ్ర సదస్సులో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అర్ధాంతరంగా వెళ్లిపోయారు. హుటాహుటిన అమెరికాకు పయనమయ్యారు. అత్యవసరంగా భద్రతా మండలి సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. వచ్చీరాగానే భద్రతా మండలి సమావేశంలో పాల్గొననున్నట్లు వైట్‌హౌస్ తెలిపింది. ఈ విషయాన్ని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ (Caroline Leavitt) వెల్లడించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
జీ7 సదస్సులో ట్రంప్ చర్చలు జరిపారని.. యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో కీలక ఒప్పందం చేసుకున్నట్లు లీవట్ వెల్లడించారు. పశ్చిమాసియా లో చోటుచేసుకున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ట్రంప్ అర్ధాంతరంగా పర్యటన ముగించుకుని అమెరికాకు బయల్దేరినట్లు లీవిట్ పేర్కొన్నారు. ఇక ట్రంప్ కూడా జీ7 సభ్య దేశాల (G7 member countries) నేతలతో గ్రూప్ ఫొటో దిగిన తర్వాత అత్యవసరంగా తిరిగి వెళ్లాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ (Macron) స్పందిస్తూ.. ట్రంప్ వెనుదిరగడం సరైన నిర్ణయమే అని అన్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధాన్ని ముగించాలని జీ7 నేతలు పిలుపునిచ్చారు. ఇప్పటికైనా ఇరాన్‌కు సమయం మించిపోలేదని.. అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ సూచించారు. కెనడా వేదికగా జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందాన్ని అంగీకరించాల్సి ఉండాల్సిందని వ్యాఖ్యనించారు.