Tributes | బాబు జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శప్రాయం – మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ, ఆంధ్ర‌ప్ర‌భ ప్రతినిధి : నిరుద్యోగ యువతకు పోలీస్ శాఖ ఉపాధి మార్గాలు చూపడం అభినందనీయమని ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం ఆయన నల్లగొండ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి ఉత్సవాలలో పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొని పలువురు నిరుద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. తర్వాత నల్లగొండ జిజిహెచ్ లో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ యూనిట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన వేరువేరు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువ‌త‌కు ఉపాధి కల్పించే లక్ష్యంతో వివిధ కంపెనీలతో చర్చించి మెగా జాబ్ మేళాను నిర్వహించడం అభినందనీయం అన్నారు. జాబ్ మేళాను నిర్వహించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్ ను అభినందించారు. యువతకు ఉపాధి కల్పించేందుకు అవసరమైన సహకారాన్ని ప్రతీక్ మెమోరియల్ ట్రస్టు ద్వారా అందిస్తానని హామీ ఇచ్చారు.

జగ్జీవన్ రామ్ ను ఆదర్శంగా తీసుకోవాలి
బాబూ జ‌గ్జీవ‌న్ రామ్‌ను స్పూర్తిగా తీసుకొని యువ‌త‌ ముందుకెళ్లాలని మంత్రి కోమ‌టిరెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర వ్యవసాయ , రక్షణ శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఎన్నో మార్పులను తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రత్యేకించి వ్యవసాయంలో హరిత విప్లవానికి కృషి చేశారన్నారు. ఈ రోజు దేశంలో ఎగుమతులు హెచ్చు స్థాయిలో ఉన్నాయంటే దానికి కారణం జగ్జీవన్ రామ్ అని అన్నారు. జగ్జీవన్ రామ్ కుమార్తె మీరా కుమార్ లోక సభ స్పీకర్ గా తెలంగాణ బిల్లును పాస్ చేయడంలో కీల‌క‌ పాత్ర పోషించారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *