హైదరాబాద్ -దివంగత నేత బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ లు ఘనంగా నివాళులర్పించారు.. ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు..
హైదరాబాద్ లోని బషీర్ బాగ్ లో ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో కలసి రేవంత్ పూల మాల వేసి నివాళులర్పించారు..ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, జగ్జీవన్ జయంతిని స్మరిస్తూ జరుపుకునే ‘సమానత్వ దినోత్సవం’ సందర్భంగా సామాజిక సాధికారత కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
సమ సమాజ దార్శనికుడు – కెసిఆర్
ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ లో నేడు జరిగిన కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ . ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరమోధుడిగా, ఉప ప్రధానిగా, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సమ సమాజ దార్శనికుడిగా జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు మహోన్నతమైనవని కొనియాడారు.
చిన్ననాటి నుంచే వివక్షను ఎదుర్కొన్న ఆయన కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారని కేసీఆర్ చెప్పారు. స్వాతంత్ర్య పోరాటంలో క్రియాశీలంగా పాల్గొన్నారని…. అనంతరం దేశ స్వయంపాలనలో కేబినెట్ మంత్రిగా కార్మిక శాఖలో అనేక సంస్కరణలను తీసుకొచ్చారని కితాబునిచ్చారు. దేశ రక్షణ, వ్యవసాయం, టెలి కమ్యూనికేషన్స్ శాఖలకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని చెప్పారు. ఉప ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేశారని అన్నారు. ఆయన జయంతిని సమతా దివస్ గా జరుపుకోవడం… జాతి కోసం వారు చేసిన సేవలకు దర్పణంగా నిలుస్తుందని అన్నారు. అంటరానితనం, కులం పేరుతో కొనసాగుతున్న సామాజిక వివక్ష సంపూర్ణంగా సమసిపోయే దిశగా మనందరం పని చేసినప్పుడే బాబు జగ్జీవన్ రామ్ కు ఘనమైన నివాళి అర్పించిన వారమవుతామని చెప్పారు.

