TRIBES | అడ్డుకుంటే తిరుగుబాటే

TRIBES | అడ్డుకుంటే తిరుగుబాటే

  • కోలాం గిరిజనుల హెచ్చరిక

TRIBES | ఉట్నూర్, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రభుత్వం అంతరించిపోతున్న ఆదిమ గిరిజనులకు ఇండ్లు మంజూరు చేస్తుంటే అటవీశాఖ నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకుంటుందని, సంయమనంతో ఉన్న తమను ఇబ్బందులకు గురిచేస్తే అటవీశాఖ అధికారులపై తిరగబడతామని కోలాం సేవా సంఘం మండల అధ్యక్షులు సిడాం బాపూరావు హెచ్చరించారు. ఇవాళ‌ అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ మన్ పథకం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుంటే అటవీశాఖ అధికారులు కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో ఉన్నందున తమ గ్రామాల్లో ఇండ్లు నిర్మించుకోవడానికి వీలు లేదంటూ అడ్డంకులు చెబుతున్నారని పేర్కొన్నారు.

మండలంలోని బీర్సాయిపేట కోలాంగూడ, జీయర్నగర్, జెండా గుడా, చెరువుగూడ, కుమ్మరి కుంట, మొర్రిపేట్, నాగపూర్, దంతన్ పల్లి కొల్లంగూడ, సోనాపూర్, రాజులగూడ, రాజుల మడుగు, ఎర్రగుట్ట, మాణిగూడ, శాంతాపూర్, ధర్మాజీపేట తదితర గ్రామాల్లో కొల్లం గిరిజనులు అనాదిగా నివసిస్తున్నారన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇండ్లు నిర్మించుకోవడానికి ఎలాంటి అడ్డంకులు చెప్పవద్దంటూ ఎంపీ ఎమ్మెల్యేలతో పాటు, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, జిల్లా అటవీ శాఖ అధికారికి వినతిపత్రాలు సమర్పించడం జరిగిందని, అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తమ ఆందోళన కార్యక్రమాన్ని ఉదృతం చేస్తామన్నారు.

తమ ఇండ్లు నిర్మించకుండా అడ్డుకుంటున్న అటవీశాఖ అధికారులను తమ గ్రామాలలోకి రానీయబోమన్నారు. ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వం వెంటనే స్పందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న ఇండ్ల నిర్మాణాల్లో పూర్తిచేసేలా కొల్లం గిరిజనులకు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో ఆయా గ్రామాల పటేళ్లు టేకం చిన్ను, మడవి మాణిక్ రావు, కొడప మారుతి, ఆత్రం ముకుందరావు, కొడప సోము, కొడప రాజు, టెకం భీమ్రావు, కొలం ఆదివాసి గిరిజనులు పాల్గొన్నారు.

Leave a Reply