Treatment | “నాన్న ఎప్పుడు ఇంటికి వస్తాడు?”

Treatment | “నాన్న ఎప్పుడు ఇంటికి వస్తాడు?”
- ఒక కాలు తొలగింపు,
- తల్లి లంగ్స్ క్యాన్సర్‌తో పోరాటం
- దాతల సహాయం కోసం ఎదురుచూపులు
Treatment | పాలకుర్తి, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామానికి చెందిన పడాల సత్యం ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఆయన రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. పరిస్థితి విషమించడంతో వైద్యులు ఒక కాలును తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరో కాలుకు కూడా పలు శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు తెలిపారు. ఇప్పటికే ఈ కుటుంబం కష్టాల్లో ఉండగా మరొక విషాదం వారిని వెంటాడుతోంది. సత్యం భార్య సునీత 2017 సంవత్సరం నుంచి లంగ్స్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది.
ఎన్నో సంవత్సరాలుగా ఆమె చికిత్స కొనసాగుతుండగా, మందులు, పరీక్షలు, ఆసుపత్రి ఖర్చులు కుటుంబంపై భారీ భారంగా మారాయి. సత్యం కుటుంబానికి ఆయనే ఏకైక ఆదాయ వనరు. రోజు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. ఇప్పుడు ప్రమాదం కారణంగా ఆయన పూర్తిగా పని చేయలేని పరిస్థితి రావడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉండటంతో వారి భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది.
తండ్రి ఆసుపత్రి బెడ్‌పై ఉడటాన్ని చూసి పిల్లలు కన్నీళ్లతో “నాన్న ఎప్పుడు ఇంటికి వస్తాడు?” అని అడుగుతున్న దృశ్యాలు ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేస్తున్నాయి. ఒకవైపు తండ్రి ప్రమాద చికిత్స, మరోవైపు తల్లి క్యాన్సర్ చికిత్స… రెండు వైపులా ఖర్చులు రోజురోజుకు పెరుగుతుండటంతో కుటుంబం దాతల సహాయం కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే అప్పులు చేసి కొంత మొత్తాన్ని సమకూర్చుకున్నప్పటికీ, ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు అవసరం ఉందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మానవత్వంతో స్పందించి చిన్న సహాయం చేసినా, అది ఈ కుటుంబానికి ప్రాణాధారంగా మారుతుందని గ్రామస్థులు కోరుతున్నారు. దాతలు సహాయం చేయదలచిన వారు సంప్రదించాల్సిన నెంబర్ / ఫోన్‌పే: 7093162973.
