స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి స‌మ‌ర్థ నాయ‌క‌త్వం ముఖ్యం…

స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి స‌మ‌ర్థ నాయ‌క‌త్వం ముఖ్యం…

ప్ర‌తి విజ‌యం వెనుకా దృఢమైన నాయకత్వం పాత్ర‌
ఏపీ జేఏసీ ఛైర్మన్ ఎ.విద్యాసాగర్

విజయవాడ, ఆంధ్రప్రభ : స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి స‌మ‌ర్థ నాయ‌క‌త్వం ముఖ్య‌మ‌ని.. సమర్థ నాయకత్వం ఉన్నప్పుడే సంఘాలు సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగగలవని.. చరిత్రలో ప్ర‌తి విజ‌యం వెనుక దృఢ‌మైన నాయ‌క‌త్వ ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించి, ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి అడుగులు వేయాల‌ని ఏపీ జేఏసీ ఛైర్మ‌న్ ఎ.విద్యాసాగ‌ర్ అన్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జా ర‌వాణా శాఖ (ఏపీఎస్ ఆర్‌టీసీ) ఉద్యోగుల సంఘాల్లో కీల‌క‌మైన నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (ఎన్ఎంయూ) ఆధ్వర్యంలో నిర్వ‌హించిన రెండు రోజుల నాయ‌క‌త్వ శిక్ష‌ణ త‌ర‌గ‌తుల ప్రారంభ కార్య‌క్ర‌మానికి ఏపీ జేఏసీ ఛైర్మ‌న్ ఎ.విద్యాసాగ‌ర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. శిక్ష‌ణ త‌ర‌గ‌తుల‌ను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడుతూ నాయకత్వం అంటే కేవలం డిమాండ్లు సాధించడం మాత్రమే కాకుండా, ఉద్యోగులు, కార్మికులకు నమ్మకం కల్పించే బాధ్యత కూడా ఉందని అన్నారు.

నిజాయితీ, మానవతా దృక్పథం, స్పష్టమైన దిశను చూపగల సామర్థ్యం ఉన్న నాయకత్వమే సమాజానికి అవసరమని స్ప‌ష్టం చేశారు. ఎవరూ పుట్టుకతోనే నాయకులు కారని.. అనుభవం, పరిస్థితులు, కృషి ద్వారా నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు. కార్మికుల సంక్షేమం కోసం స్థాపించబడిన నేషనల్ మజ్దూర్ యూనియన్ లక్ష్యాలను సాధించడానికి నాయకులు నిర్మాణాత్మక వైఖరితో పనిచేయాలని పిలుపునిచ్చారు.

నాయ‌కుడిగా వేసే ప్ర‌తి అడుగూ ఎంతో కీల‌క‌మ‌ని… అందుకే అడుగు అడుగునా స్ప‌ష్ట‌మైన ప్ర‌ణాళిక, దిశానిర్దేశం చేసుకొని ముందుకు వెళ్ల‌డం ముఖ్య‌మ‌ని.. అప్పుడే విజ‌యాల‌ను అందుకోగ‌లుగుతామ‌ని, త‌ద్వారా నాయ‌క‌త్వంపై న‌మ్మ‌కం పెంచుకొని మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌నే ప‌ట్టుద‌ల నాయ‌కుడిలో క‌లుగుతుంద‌ని పేర్కొన్నారు. ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏడు జిల్లాలకు సంబంధించిన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, ఇంతకుముందే మూడు జోన్ల‌లో శిక్షణ తరగతులు నిర్వహించామని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా శిక్షణా తరగతులు పూర్తవుతాయని, మిగతా అన్ని ప్రాంతాలలో కూడా శిక్షణ త‌ర‌గ‌తులను సంతృప్తిక‌రంగా పూర్తిచేశామ‌న్నారు.

ఇది నాయకులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని మున్ముందు భవిష్యత్తు నాయకత్వాన్ని తీర్చిదిద్దే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించామని, ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు, అధ్యాపకులు, ఎన్జీవో నాయకులు వివిధ అంశాలలో నిపుణులై వారంతా పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్న‌ట్లు తెలిపారు. రెండు రోజులు పాటు జరిగే ఈ శిక్షణ తరగతుల కార్యక్రమంలో నాయకత్వ లక్షణాలు, సంఘ నియమావళి, దేశ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఉద్యోగుల మీద వాటి ప్రభావం, ఆర్టీసీ పరిస్థితి, సంస్థ మనుగ‌డ‌కు నాయకులు, కార్మికులు అవ‌లంబించాల్సిన విధానాలు తదితర అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామ‌న్నారు.

ఏడు జిల్లాలకు సంబంధించిన దాదాపు రెండు వందల మంది నాయకులు ఈ శిక్షణ తరగతుల కార్యక్రమంలో పాల్గొంటారు. ఎన్ఎంయూ రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, ఎన్జీవో సంఘ ప్రధాన కార్యదర్శి డీవీ రమణ, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు డి.స‌త్య‌నారాయ‌ణ‌రెడ్డి, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, నగర శాఖ అధ్యక్షుడు సివిఆర్ ప్రసాద్, వివిధ జిల్లాల‌కు చెందిన ఎన్ఎంయూ జిల్లా కార్య‌వ‌ర్గ స‌భ్యులు పాల్గొన్నారు.

Leave a Reply