ఈ నెల 30 వరకు సర్వీస్ లు బంద్
ట్రాక్ మరమ్మతులు కారణంగా దక్షిణ మధ్య రైల్వే
నేటి నుంచి చర్లపల్లి నుంచి కాకినాడ,నర్సాపూర్ లకు స్పెషల్ ట్రైన్స్ ..
హైదరాబాద్: నిర్వహణ పనుల కారణంగా చర్లపల్లి-తిరుపతి, కాజీపేట-తిరుపతి మధ్య నడిచే రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. చర్లపల్లి-తిరుపతి రైలు ఈ నెల 8 నుంచి 29 వరకు, తిరుపతి-చర్లపల్లి (07258) రైలు మే 9 నుంచి 30 వరకు అందుబాటులో ఉండదని అధికారులు తెలిపారు. అదేవిధంగా కాజీపేట-తిరుపతి (07253) రైలు ఈ నెల 6 నుంచి 25 వరకు, తిరుపతి-కాజీపేట (07254) రైలు ఈ నెల 7 నుంచి 25 వరకు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
వేసవి ప్రత్యేక రైళ్లు..
శుక్రవారం సాయంత్రం నుంచి ఇక చర్లపల్లి నుంచి కాకినాడ, నర్సాపూర్ మధ్య 36 ప్రత్యే క సర్వీసులను నడుపుతున్నట్లు ఎస్‌సీఆర్ వెల్లడించింది. చర్లపల్లి-కాకికినాడ టౌన్ (07031) ప్రత్యేక రైలు మే 2 నుంచి జూన్ 27 వరకు ప్రతి శుక్రవారం రాత్రి 7.20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరుతుందని, మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో ఈ రైలు (07032) మే 4 నుంచి జూన్ 29 వరకు పత్రి ఆదివారం సాయంత్రం 6.55 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. రెండు మార్గాల్లో ఈ రైలు నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమంత్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు.
చర్లపల్లి-నర్సాపూర్ ప్రత్యేక రైలు (07233) మే 2 నుంచి జూన్ 27 వరకు ప్రతి శుక్రవారం రాత్రి 7.15 గంటలకు చర్లవల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07234) మే 4 నుంచి జూన్ 29 వరకు ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుతుంది. రెండు మార్గాల్లో రైలు నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు స్టేషన్లలో ఆగుందని చెప్పారు.