నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: నంద్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహానంది మండలం ఎం.సి. ఫారం గ్రామంలోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ మూడవ సంవత్సరం చదువుతున్న జనార్దన్ నాయక్ (చిత్తూరు జిల్లా తండా గ్రామం వాసి) పాలేరు వాగులో ఈత కొడుతూ మృతి చెందాడు. ఈ మేరకు మహానంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు, తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం, సెలవు దినం కావడంతో సుమారు పది మంది విద్యార్థులు కలిసి సమీపంలోని పాలేరు వాగు వద్దకు వెళ్లారు. అక్కడ బట్టలు ఉతికిన తర్వాత, కొంతమంది విద్యార్థులు ఈత కొట్టేందుకు వాగులోకి దిగారు.
ఈ క్రమంలోనే జనార్దన్ నాయక్ అస్వస్థతకు గురై స్పృహ తప్పిపోయాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు వెంటనే అతడిని బయటకు తీసి, కళాశాల అధికారులకు సమాచారం అందించారు. అధికారులు తక్షణమే అంబులెన్స్‌లో విద్యార్థిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినా, మార్గమధ్యంలోనే అతడు మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.