మొక్కజొన్న రైతులను మోసగిస్తున్న వ్యాపారులు

మొక్కజొన్న రైతులను మోసగిస్తున్న వ్యాపారులు

  • 60 కిలోలకు బదులు 72 కిలోల తూకం
  • నిలదీసిన రైతులు..
  • కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు..

బిక్కనూర్, ఆంధ్రప్రభ : మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు వ్యాపారులను దళారులను ఆశ్రయిస్తున్నారు. వారి చేతిలో రైతులు దగా పడాల్సిన‌ పరిస్థితి ఏర్పడింది. తూకంలో పెద్ద ఎత్తున మోసం చేయడంతో వ్యాపారుల బాగోతం బయటపడింది. దీంతో వ్యాపారులను బాధిత రైతులు నిలదీశారు. ఈ ఘటన బిక్కనూరు మండలం గురజాకుంట గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలోని గాంధారి ప్రాంతానికి చెందిన పలువురు గిరిజన వ్యాపారులు మొక్కజొన్నను కొనుగోలు చేస్తున్నారు.

గత వారం రోజులుగా గురుజకుంట గ్రామంలో తిరుగుతూ రైతులు పండించిన మొక్కజొన్నను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో బయటకు తీసుకెళ్లి అమ్మలేని పరిస్థితి నెల‌కొంది. దీంతో గ్రామానికి వచ్చిన వ్యాపారులకు మొక్కజొన్నను అమ్ముతున్నారు. 60 కేజీల బస్తాలు మొక్కజొన్న నింపుతూ డీసీఎం వాహనంలో తరలిస్తున్నారు. ఒక రైతు వద్ద తూకం వేస్తుండగా 72 కేజీలు రావడంతో అనుమానం వచ్చి వ్యాపారులను ఆయన నిలదీశారు. అంతేకాకుండా ఇప్పటివరకు వ్యాపారులకు అమ్మిన రైతులను పిలిపించారు. 60 కేజీలు అంటూ 72 కేజీలు మొక్కజొన్న ఎలా తూకం వేస్తున్నారంటూ వ్యాపారులను నిలదీశారు.

గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున పోగు కావడంతో వ్యాపారులు తప్పు జరిగిందంటూ ఒప్పుకున్నారు. ఇప్పటివరకు రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు చేసిన వారందరికీ 72 కిలోల వరకు డబ్బులు చెల్లిస్తామని వ్యాపారులు ఒప్పుకున్నారు. దీంతో గ్రామంలో గొడవ సద్దుమణిగింది. తమ గ్రామంలో ఎలాంటి మొక్కజొన్న కొనుగోలు చేయవద్దని వ్యాపారులను హెచ్చరించారు. రైతులు పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని గొప్పలు చెప్తుంది తప్ప ఎలాంటి కొనుగోలు ఏర్పాటు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

Leave a Reply